మెట్రో పార్కింగ్‌‌లో బైక్​లను కొట్టేసి..ఓఎల్ఎక్స్ లో సేల్

మెట్రో పార్కింగ్‌‌లో బైక్​లను కొట్టేసి..ఓఎల్ఎక్స్ లో సేల్
  •      ఇంట్లోనే  ఫేక్ డాక్యుమెంట్లు తయారీ 
  •     ఫేక్‌‌ ఆర్‌‌‌‌సీ, నంబర్‌‌‌‌ ప్లేట్‌‌తో ఓఎల్‌‌ఎక్స్‌‌లో అమ్మకాలు
  •     వెహికల్ చెకింగ్‌‌లో చిక్కిన ఘరానా దొంగ
  •     23 బైక్​లను స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు 

హైదరాబాద్‌‌,వెలుగు : మెట్రో పార్కింగ్‌‌ ఏరియాలు టార్గెట్‌‌గా బైక్ చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని రాచకొండ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం..   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రాయుడు చైతన్య సాయికుమార్‌‌‌‌(31) పాలిటెక్నిక్‌‌ పూర్తి చేశాడు. కొంతకాలంగా సీతాఫల్‌‌మండిలోని మైలార్‌‌‌‌గడ్డలో ఉంటున్నాడు.

తన టెక్నికల్‌‌ స్కిల్‌‌తో బైక్​లకు ఫేక్ ఆర్‌‌‌‌సీ బుక్స్‌‌, ఇతర డాక్యుమెంట్లు తయారు చేసేవాడు. ఈ క్రమంలో బైక్‌‌ చోరీలకు స్కెచ్ వేశాడు. బైక్‌‌లను కొట్టేసి ఓఎల్‌‌ఎక్స్‌‌లో అమ్మడం ప్రారంభించాడు. పార్కింగ్‌‌లో నిలిపి ఉంచిన బైక్ లాక్స్‌‌ను ఈజీగా బ్రేక్‌‌ చేసేవాడు.  డూప్లికేట్‌‌ కీస్‌‌తో ఎస్కేప్‌‌ అయ్యేవాడు. మెట్రో స్టేషన్‌‌ పార్కింగ్‌‌లో నిలిపి ఉంచిన బైక్‌‌లను లాక్ బ్రేక్ చేసి తీసుకెళ్లేవాడు. 

సిటీతో పాటు ఏపీలోనూ వరుస చోరీలు

సిటీ శివారు ప్రాంతాల్లోని చౌటుప్పల్‌‌, ఉప్పల్‌‌, మియాపూర్‌‌‌‌, అమీర్‌‌‌‌పేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలో వరుస చోరీలు చేశాడు. నంబర్ ప్లేట్ మార్చి ఫేక్ ఆర్‌‌సీ బుక్స్‌‌ తయారు చేసేవాడు. ఓఎల్‌‌ఎక్స్‌‌లో సెకండ్ సేల్​కు పెట్టి అమ్మేవాడు. ఇలా గత  ఐదేండ్లుగా వరుస చోరీలు చేస్తున్నాడు. పలుసార్లు జైలుకెళ్లినా మార్పు రాలేదు. శివారు ప్రాంతాల్లో చోరీల నివారణ కోసం రాచకొండ పోలీసులు వెహికల్‌‌ చెకింగ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా నాగోల్‌‌ క్రాస్​రోడ్స్‌‌లోని ఎస్వీఎం గ్రాండ్ వద్ద చైతన్య సాయికుమార్‌‌‌‌‌‌ వెహికల్‌‌ చెక్‌‌ చేశారు. ఓల్డ్‌‌ అఫెండర్స్‌‌ డేటా ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. సాయికుమార్ మెట్రో పార్కింగ్ ఏరియాలో బైక్​లు చోరీ చేసి ఓఎల్‌‌ఎక్స్‌‌లో తక్కువ రేటుకు అమ్మేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 23 బైక్​లు, ఫేక్ ఆర్సీలు, ప్రింటర్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.