హైదరాబాద్: ‘నేను చెప్పినట్టు విను.. లేదంటే నీ భాగస్వాములు చంపేస్తారు. నేను చెప్పినట్టు వినకపోతే కరోనా అంటించి సంపుత... ఈ రాష్ట్రంలో నేనే బాస్.... ఏ పోలీస్‌కు చెప్పుకుంటావో చెప్పుకో..’ ఇదీ రాధాకిషన్ రావు వార్నింగ్.. తనదైన శైలిలో బెదిరించి చేసిన సెటిల్మెంట్..! కోవిడ్ పాండమిక్ టైంలో కూకట్ పల్లికి చెందిన బాధితుడు సుదర్శన్ కు తన భాగస్వాములు ఏవీకె రాజు, మరో వ్యక్తి రాజుల మధ్య జరిగిన డబ్బుల గొడవలోకి రాధాకిషన్ రావు ఎంట్రీ ఇచ్చారు. దీనిపై బాధితుడు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకిషన్ రావు తనను గలీజు మాటలతో తిట్టడంతో పాటు టైర్‌తో కొట్టాడని బాధితుడు సుదర్శన్ కూకట్పల్లి పోలీసులకు తెలిపారు.
ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు కోర్టు అనుమతితో రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ విచారణ పూర్తయిన తర్వాత అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కూకట్ పల్లి పోలీసులు షాక్ ఇచ్చారు. తాజాగా నమోదైన ప్లాట్ సెటిల్మెంట్లో భాగంగా సుదర్శన్‌ను బెదిరించిన కేసులో పోలీసులు ఆయనను ఏ-1 గా చేర్చారు.
ఇక ఈ కేసులో విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చదువుకుని, చట్టంపై అవగాహన ఉన్నా తనను రెండు సంవత్సరాల పాటు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకుండా చేశాడని బాధితుడు సుదర్శన్ ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావు అరెస్ట్ అయ్యాడనే విషయం తెలుసుకుని ఇప్పుడు ధైర్యంగా బయటికి వచ్చి కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు.