
- ఎన్డీయే కూటమి అభ్యర్థి ఘన విజయం..
- సీపీ రాధాకృష్ణన్‌కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు
- జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు
- ఓటు హక్కు వినియోగించుకున్న 767 మంది సభ్యులు
- 15 ఓట్లు ఇన్ వ్యాలిడ్.. 98.20 శాతం పోలింగ్
- ఓటింగ్‌కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదల్
న్యూఢిల్లీ: ఎన్డీయే అభ్యర్థి సీపీ.రాధాకృష్ణన్ దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సీపీ.రాధాకృష్ణన్‌కు మొదటి ప్రాధాన్యత కింద 452 ఓట్లు పోలవ్వగా.. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పడ్డాయి. పార్లమెంట్ బిల్డింగ్‌లోని వసుధ కాంప్లెక్స్ రూమ్ 101లో మంగళవారం (సెప్టెంబర్ 09) పోలింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
మొత్తం 781 మంది ఎంపీలకుగాను 767 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ నుంచి 12 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు. 752 బ్యాలెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మేరకు 98.20 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి కోటా విజయానికి కావాల్సిన ఓట్లు 377 కాగా.. మొదటి ప్రాధాన్యత కింద సీపీ.రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు నమోదయ్యాయి.
దీంతో ఎన్డీయే అభ్యర్థి.. ఇండియా కూటమి క్యాండిడేట్ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ.మోదీ ప్రకటించారు. తమిళనాడు నుంచి ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన మూడో వ్యక్తిగా రాధాకృష్ణన్ నిలిచారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికవ్వడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అభినందనలు తెలిపారు.
ఎన్నికలో క్రాస్ ఓటింగ్!
ఇండియా కూటమికి 315 మంది బలం ఉండగా.. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి మాత్రం 300 ఓట్లే పోలవడంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తున్నది. సుమారు 15 మంది అపోజిషన్ పార్టీల ఎంపీలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఓటేసినట్లు స్పష్టమవుతున్నది. ఓటింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో సోమవారమే ఖర్గే నేతృత్వంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. దీంతో ఇండియా కూటమి ఎంపీలు పొరపాటు చేసే అవకాశం లేదు. 15 మంది ఇండియా కూటమి సభ్యులు ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఓటేసినట్లు తెలుస్తున్నది.
ఫస్ట్ ఓటేసిన ప్రధానమంత్రి మోదీ
పోలింగ్ ప్రక్రియ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘వైస్ ప్రెసిడెంట్ 2025 ఎన్నికలో ఓటేశాను’అని ఎక్స్‌లో ప్రకటించారు. అనంతరం ఆకస్మిక వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లోని ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిపోయారు. తర్వాత లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు పలువురు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్, ఆ పార్టీ ఎంపీలు ఓటేశారు. జైల్లో ఉన్న బారాముల్లా ఎంపీ ‘ఇంజనీర్ రషీద్’ కోర్టు అనుమతితో పార్లమెంట్‌కు వచ్చి ఓటేశారు. ఇండియా కూటమి నుంచి 100 శాతం ఓట్లు (315 మంది) పోలైనట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు.
తెలుగు వ్యక్తి నిలబడితేఓటేయరా?: రేణుకా చౌదరి
ఓటింగ్‌ను బీఆర్ఎస్ బహిష్కరించడంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి తరఫున తెలంగాణకు చెందిన జస్టిస్ సుద ర్శన్ రెడ్డి పోటీలో ఉంటే.. బీఆర్ఎస్ ఎంపీలు ఓటేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. సుదర్శన్ రెడ్డి తెలుగులో మాట్లాడే వ్యక్తి అని, తెలంగాణ కోసం ఎంతో చేశారని.. అలాంటి అభ్యర్థికి ఓటేయకపోవడం సరికాదని ఫైర్ అయ్యారు.
13 మంది గైర్హాజరు
ఉభయ సభల్లో కలిపి మొత్తం 788 మంది సభ్యులు ఉండాలి. రాజ్యసభలో 6, లోక్‌సభలో ఒక సీటు ఖాళీగా ఉంది. దీంతో ఓటర్ల సంఖ్య 781కు తగ్గింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో 12 మంది (బీఆర్ఎస్ 4, బీజేడీ 7, అకాలీదల్ 1) తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో మొత్తం 767 ఓట్లు పోలయ్యాయి. మ్యాజిక్ ఫిగర్ 386 ఓట్లు.
ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన ఎన్డీయే కూటమికి ధన్యవాదాలు తెలియజేస్తున్న. ఇక నుంచి నాపై బాధ్యత మరింత పెరిగింది. భారత జాతీయవాదానికి ఇదొక గొప్ప విజయం. మనమంతా ఒక్కటే.. మనమంతా ఒక్కటిగా ఉండాలి. దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలనుకుంటున్నాం. ఈ విజయం అందుకు దారి తీస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్తున్నాను.
- సీపీ రాధాకృష్ణన్, కాబోయే ఉప రాష్ట్రపతి
ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు అభినందనలు.
ప్రజా జీవితంలో రాధాకృష్ణన్‌కు దశాబ్దాల అనుభవం ఉంది.
ఇది దేశ పురోగతికి దోహదపడుతుంది. ఆయన పదవీకాలం విజయవంతంగా, ప్రభావవంతంగా కొనసాగాలని ఆశిస్తున్నాను.
- ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీల తీర్పును స్వాగతిస్తున్నాను. ఎన్డీయే అభ్యర్థిగా విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు అభినందనలు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు.. ఓటమిని స్వీకరించాలి. ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు. ప్రజాస్వామ్య బలం.. కేవలం విజయంలో మాత్రమే లేదు. చర్చలు, నిరసన ద్వారా కూడా ప్రజాస్వామ్యం బలపడుతుంది. మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తా.
- జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, ఇండియా కూటమి అభ్యర్థి