రేడియో జాకీలుగా మారిన సంగారెడ్డి జిల్లా జైలు ఖైదీలు

రేడియో జాకీలుగా మారిన సంగారెడ్డి జిల్లా జైలు ఖైదీలు

ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు తెలంగాణ జైళ్ళ శాఖ ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు చేపట్టింది. దాంతో ఇప్పుడు చాలా జైళ్ళల్లో ఖైదీల సంఖ్య తగ్గిపోతోంది. సంస్కరణల్లో భాగంగా ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జైలులో కూడా FM రేడియో స్టేషన్ ను ప్రారంభించింది.

హలో FM… నేను… అంటూ ఖైదీలే… తోటి ఖైదీలను పలుకరిస్తున్నారు. గతంలో చంచల్ గూడా జైలులో ఏర్పాటు చేసిన జైలు రేడియో తరహాలోనే ఇక్కడ కూడా 70వేల రూపాయలు ఖర్చుపెట్టి… FM ను ప్రారంభించారు. ఖైదీలు బ్యారక్ ల్లోనే ఉండి… ఈ FM పాటలను వింటున్నారు. దీంతో ఖైదీల్లో మానసిక ప్రశాంతతను నింపుతున్నామని చెబుతున్నారు జైలు అధికారులు.

ఖైదీలే జాకీలుగా వ్యవహరిస్తూ కోరుకున్న పాటలను ప్లే చేయడం, ఆరోగ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక గీతాలను ఈ రేడియో ద్వారా వినిపిస్తున్నారు. వినోదంతో పాటు ఖైదీలకు న్యాయ సహాయం, ములాఖత్, పెరోల్ , బెయిల్ కి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు.

పొద్దున్నే ఆరింటికి సుప్రభాతంతో మొదలై… ఆరోజు ప్రాముఖ్యత, గొప్ప వ్యక్తుల పరిచయం, పీటీ పరేడ్ కు అనుకూలమైన లైట్ మ్యూజిక్ , భక్తి గీతాలను ఇందులో ప్రసారం చేస్తున్నారు. ఖైదీల మనోగతాలు, మిమిక్రీలు, పాటలు, వివిధ కళలు, జీవితంలో మార్పు, విడుదలైన తర్వాత ఎలా స్థిరపడాలి అనే అంశాలపై ఖైదీలకు రేడియో కార్యక్రమంలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేస్తున్నారు. రేడియో ప్రసారాలు వినేందుకు అన్ని బ్యారక్ లలో సౌండ్ బాక్స్ లను కూడా ఏర్పాటు చేశారు.

ఖైదీల్లో మార్పు తీసుకొచ్చి వారిని ప్రతికూల ఆలోచనలు నుంచి బయటపడేయడానికి ఈ జైలు రేడియో ఉపయోగపడుతుందని అంటున్నారు అధికారులు. ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే భావన కలగదని చెబుతున్నారు.