‘ఫ్రెంచ్‌’ రారాజు నడాల్‌

‘ఫ్రెంచ్‌’ రారాజు నడాల్‌
  • 13వ సారి టైటిల్‌‌ కైవసం
  • ఫైనల్లో జొకోవిచ్‌ కు చెక్‌‌ ఫెడరర్‌ రికార్డు సమం

పారిస్‌‌: క్లే కోర్టులో తనకు ఎదురులేదని స్పెయిన్‌‌ బుల్‌‌ రఫెల్‌‌ నడాల్‌‌ మరోసారి నిరూపించుకున్నాడు. గాయాలు వేధించినా.. అప్పుడప్పుడు ఫామ్‌‌ కోల్పోయినా.. తనకు అచ్చొచ్చిన రోలాండ్‌‌ గారోస్‌‌ (ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌)లో మరో చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ ఫైనల్లో వరల్డ్‌‌ రెండో ర్యాంకర్‌‌ నడాల్‌‌ 6–0, 6–2, 7–5తో వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌ (సెర్బియా)పై గెలిచాడు. దీంతో 13వసారి ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ టైటిల్‌‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు. ఫలితంగా కెరీర్‌‌లో 20వ మేజర్‌‌ టైటిల్‌‌తో స్విస్‌‌ లెజెండ్‌‌ రోజర్‌‌ ఫెడరర్‌‌ (20) అత్యధిక టైటిల్స్‌‌ రికార్డును సమం చేశాడు. 2018లో ఈ రికార్డు సాధించిన ఫెడరర్‌‌ ఖాతాలో 6 ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌, ఒక ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌, 8 వింబుల్డన్‌‌, 5 యూఎస్‌‌ ఓపెన్‌‌ టైటిల్స్‌‌ ఉన్నాయి. 2005లో తొలి మేజర్‌‌ టైటిల్‌‌ గెలిచిన 34 ఏళ్ల నడాల్‌‌… కెరీర్‌‌లో ఒక ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌, 2 వింబుల్డన్‌‌, 4 యూఎస్‌‌ ఓపెన్‌‌, 13 ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ టైటిల్స్‌‌ గెలిచాడు. అయితే పారిస్‌‌ గడ్డపై నడాల్‌‌కు ఇది వరుసగా నాలుగో టైటిల్‌‌ కావడం మరో విశేషం. కాగా, ఒకే గ్రాండ్‌‌స్లామ్‌‌ టైటిల్‌‌ను అత్యధికసార్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌‌గానూ నడాల్‌‌ (13 ఫ్రెంచ్‌‌) రికార్డులకెక్కాడు. మార్గరెట్‌‌ కోర్టు (11 ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌), మార్టినా నవ్రోత్తిలోవా (9 వింబుల్డన్) రెండు, మూడు స్థానాల్లో ఉండగా, ఫెడరర్‌‌ (8 వింబుల్డన్‌‌), జొకోవిచ్‌‌ (8 ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌) టైటిల్స్‌‌తో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

ఏకపక్షమే..

జొకోతో రెండు గంటలా 41 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌ ఏకపక్షంగా నడించింది. బలమైన సర్వీస్‌‌లు, బేస్‌‌లైన్‌‌ గేమ్‌‌తో పాటు క్రాస్‌‌ కోర్టు షాట్స్‌‌తో నడాల్‌‌ హడలెత్తించాడు. తొలిసెట్‌‌లో ఫస్ట్‌‌, థర్డ్‌‌, ఫిప్త్‌‌ గేమ్‌‌లో జొకో సర్వ్‌‌ను బ్రేక్‌‌ చేసి ఈజీగా సెట్‌‌ను సొంతం చేసుకున్నాడు. రెండోసెట్‌‌లోనూ నడాల్‌‌ దూకుడే కొనసాగింది. మూడు, ఐదో గేమ్‌‌లో జొకో సర్వీస్‌‌ను చేజార్చుకుని మూల్యం చెల్లించుకున్నాడు. మూడోసెట్‌‌లో కాస్త పుంజుకున్నట్లు కనిపించిన జొకో బలమైన రిటర్న్స్‌‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఇరువురు సర్వీస్‌‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు 5–5తో సమమైంది. 11వ గేమ్‌‌లో తన సర్వ్‌‌లో జొకో డబుల్‌‌ ఫాల్ట్‌‌ చేయడంతో నడాల్‌‌ ఆధిక్యంలోకి వెళ్లాడు. 12 వ గేమ్‌‌లో సర్వ్‌‌ను నిలబెట్టుకున్న స్పెయిన్‌‌ స్టార్‌‌ మ్యాచ్‌‌తో పాటు టైటిల్‌‌ను సొంతం చేసుకున్నాడు.

100వ విజయం..

తాజా విజయంతో నడాల్‌‌.. రోలాండ్‌‌ గారోస్‌‌లో 100 మ్యాచ్‌‌లు గెలిచిన ఫస్ట్‌‌ ప్లేయర్‌‌గా రికార్డుల్లో చోటు సంపాదించాడు. కేవలం రెండు మ్యాచ్‌‌ల్లో మాత్రమే ఓడాడు. ఓవరాల్‌‌ ఏటీపీ టూర్‌‌లో 86 సింగిల్స్‌‌ టైటిల్స్‌‌తో నడాల్‌‌ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.  ఓపెన్‌‌ ఎరాలో జిమ్మీ కానర్‌‌ (109), ఫెడరర్‌‌ (103), ఇవాన్‌‌ లెండిల్‌‌ (94) ఇతని కంటే ముందున్నారు. 24 గ్రాండ్‌‌స్లామ్‌‌ సింగిల్స్‌‌ టైటిల్స్‌‌ సాధించిన మార్గరెట్‌‌ కోర్టు కంటే ఫెడరర్‌‌, నడాల్‌‌ మరో నాలుగు టైటిల్స్‌‌ వెనకబడి ఉండగా… సెరెనా (అమెరికా) 23 టైటిల్స్‌‌తో ఉంది. ఇక టోర్నీ మొత్తం ఒక్క సెట్‌‌ కూడా కోల్పోకుండా నాలుగు గ్రాండ్‌‌స్లామ్‌‌ టైటిల్స్‌‌ను గెలిచిన ఏకైక ప్లేయర్‌‌గా  నడాల్‌‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. జాన్‌‌ బోర్గ్‌‌ (3 టైటిల్స్‌‌) పేరుమీదున్న రికార్డును అధిగమించాడు.