వెటర్నరీ వర్సిటీలో ర్యాగింగ్‌

వెటర్నరీ వర్సిటీలో ర్యాగింగ్‌

ఆలస్యంగా వెలుగులోకి ఘటన
హాస్టల్ నుంచి 34 మంది సీనియర్ల బహిష్కరణ

హైదరాబాద్‌, వెలుగు : పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెకండియర్‌, ఫోర్త్‌ ఇయర్‌ కు చెందిన సీనియర్‌ విద్యార్థులు తాజాగా వర్సిటీలో చేరిన ఫస్ట్‌ ఇయర్‌  విద్యార్థులపై వికృత చేష్టలతో ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. జూనియర్‌ విద్యార్థుల ఫిర్యాదు మేరకు ర్యాగింగ్‌కు పాల్పడిన 34 మంది సీనియర్‌ విద్యార్థులను హాస్టల్‌ నుంచి బహిష్కరిస్తూ వర్సిటీ యాక్షన్‌ తీసుకుంది.  దీపావళి మరుసటి రోజున 25 మంది ఫస్టియర్‌ స్టూడెంట్లను సెకండియర్‌, ఫోర్త్‌ ఇయర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేశారని వార్డెన్‌కు జూనియర్లు సీల్డ్‌ బ్యాక్స్‌లో  ఫిర్యాదు చేశారు.  దీనిపై వర్సిటీ కమిటీ వేయగా.. ఆ కమిటీ ఈనెల 27, 28న సెకండియర్‌, ఫోర్త్‌ ఇయర్‌ విద్యార్థులను ఎంక్వైరీ చేసింది. 29న కమిటీ తన రిపోర్ట్‌ ఇచ్చింది. 

నిందితుల్లో 34 మంది విద్యార్థులు ఉన్నట్లు అసోసియేట్‌ డీన్‌ నిర్ధారించారు. వారిపై సోమవారం యాక్షన్‌ తీసుకున్నారు. వారిలో 25మంది సీరియస్‌గా ర్యాగింగ్‌ కు పాల్పడినట్లు నిర్ధారించి వారిని కాలేజీ హాస్టల్‌ నుంచి వెంటనే ఖాళీ చేయించారు. దాంతో పాటు కాలేజీ క్యాంపస్‌, అకడమిక్స్‌  నుంచి రెండు వారాల పాటు బహిష్కరించారు.  మిగతా 9 మందిని హాస్టల్‌ నుంచి ఖాళీ చేయడంతో పాటు   ఎంక్వైరీ పూర్తయ్యే వరకు కాలేజీ వాహనాల్లో అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు. మరోవైపు వర్సిటీలో ప్రొఫెసర్లు రీసెర్చ్​ పక్కనపెట్టి రియల్‌ ఎస్టేట్‌ దందా చేస్తూ విద్యార్థులను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు కూడా పట్టించుకోవడం లేదని, ఈనేపథ్యంలోనే ప్రతిష్టాత్మకమైన వెటర్నరీ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ చోటుచేసుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సంబంధిత డీన్‌ను ఫోన్‌లో వివరాలు అడిగేందుకు ‘వెలుగు’ ప్రయత్నించగా ఆయన ఫోన్ స్విచాఫ్‌ రావడం గమనార్హం.