తమిళనాడు రాజకీయాల్లో రాఘవ లారెన్స్ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి విజయ్ పోటీ చేసి గెలిచిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుచ్చి ఈస్ట్ ఒకటి. ఈ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో విజయ్ టీవీకే పార్టీ తరపున నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు.. రాఘవ లారెన్స్ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉందని తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో రాఘవ లారెన్స్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ప్రకటన చేశారు.
జూన్ 11న అన్నీ చెబుతా..
“అందరికీ నమస్కారం. తిరుచ్చి ఈస్ట్ ఎన్నికల్లో నేను పోటీ చేయబోతున్నాననే వార్తలు వివిధ మీడియా వేదికల్లో ప్రచారంలో ఉన్నాయి. నా మీడియా స్నేహితులు చాలామంది ఫోన్ చేసి, నన్ను కలిసి ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఊహాగానాలు ఎక్కువ కావడంతో నేను స్పందించాల్సిన అవసరం ఉందని భావించాను.
ప్రస్తుతం నేను ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. నా షూటింగ్ షెడ్యూల్ ఈ నెల 10వ తేదీతో పూర్తవుతుంది. నా తల్లి ఆశీర్వాదాలతో, నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ నెల 11వ తేదీ గురువారం ఉదయం 9:30 గంటలకు ప్రకటించబోతున్నాను ” అని లారెన్స్ X వేదికగా తెలిపారు.
Hi everyone, News about me contesting in Trichy East election has been circulating across various media platforms.
— Raghava Lawrence (@offl_Lawrence) June 7, 2026
All my Media friends have been reaching out to me over phone and requesting to meet me asking for clarification. Since the speculation has grown to a point where I… pic.twitter.com/68ZyN6P0l9
ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి నెలకొంది. లారెన్స్ తన పోస్టులో ఎన్నికలు లేదా రాజకీయాల గురించి నేరుగా ప్రస్తావించకపోయినా, “జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం” అని చెప్పడం, “మార్పు”, “సేవయే దైవం” వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగించడం వల్ల ఆయన రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.
అయితే రాఘవ లారెన్స్ నిజంగా ఎన్నికల బరిలోకి దిగుతారా? లేక సామాజిక సేవలకు సంబంధించిన మరో కీలక ప్రకటన చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాలంటే జూన్ 11 ఉదయం వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం తమిళ రాజకీయాలు, సినీ వర్గాల్లో ఆయన ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
సీఎం విజయ్ వ్యూహం..
సీఎం విజయ్ ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి రాజీనామా చేశారు. దీంతో.. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక జరగనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తమిళనాడులోని కీలక నియోజకవర్గాల్లో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు టీవీకే జనంలో మంచి పేరు ఉన్న వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిసింది.
సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న రాఘవా లారెన్స్ వైపు టీవీకే ఆశగా చూస్తోంది. ఈ క్రమంలోనే.. తిరుచ్చి తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా రాఘవ లారెన్స్ను బరిలో నిలిపితే పార్టీ మరింత బలపడుతుందని టీవీకే భావిస్తున్నట్లు సమాచారం. త్రిష ఈ స్థానం నుంచి పోటీ చేస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అవన్నీ పుకార్లేనని తేలిపోయాయి. ఇక తాజాగా లారెన్స్ నుంచి కొత్త ప్రకటన అని అనౌన్స్ అవ్వడంతో తమిళ సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
