అసలైన పేదలకు ఒక్క పైసా రాలేదు : రఘునందన్​రావు 

అసలైన పేదలకు ఒక్క పైసా రాలేదు : రఘునందన్​రావు 

దుబ్బాక, వెలుగు: దళిత, బీసీ బంధు బీఆర్ఎస్​ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని, అసలైన పేదలకు ఒక్క పైసా రాలేదని ఎమ్మెల్యే రఘునందన్​రావు ఆరోపించారు. మంగళవారం మండలంలోని బల్వంతాపూర్​, అక్భర్​పేట-భూంపల్లి మండలం మోతె, చేగుంట మండలం గొల్లపల్లి, జైతారం తండా, రాంపూర్, రెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ పదేండ్లుగా అధికారంలో ఉండి దుబ్బాక నియోజకవర్గాన్ని ఎందులో అభివృద్ధి చేయలేదో శ్వేత పత్రం విడుదల చేసి ఓట్లడగాలని డిమాండ్​ చేశారు.

సిద్దిపేట ఒక కన్ను దుబ్బాక ఒక కన్ను చెప్పుకునే ఆర్థిక మంత్రి హరీశ్​రావు దుబ్బాక నిధులన్నీ సిద్దిపేటకు తరలించి ఇక్కడి ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు పని నిమిత్తం మంత్రి వద్దకు వెళ్తే మీకు పని చేయనని చెప్పే మంత్రిని ఎక్కడ చూడలేదన్నారు. తాను ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిధులను తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానన్నారు.

బీజేపీకి ఓటు వేస్తే పెన్షన్​ కట్​అవుందని బెదిరించే నాయకుల మాటలు నమ్మొద్దన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతులు పండించిన క్వింటాల్​వరి పంటకు రూ. 3100 చెల్లిస్తామన్నారు. కమలం పువ్వుకు ఓటేసి గెలిపిస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతాడన్నారు. పదేండ్లుగా ఊర్లకు రాని ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డికి ఓటేద్దామా, మూడేళ్లుగా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న రఘునందన్​రావుకు ఓటేద్దామా ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. 

కేటీఆర్​ నోరు అదుపులో పెట్టుకో

మెదక్ (చేగుంట):  తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఉద్యమకారులపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని, నోరు అదుపులోపెట్టుకోవాలని ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మంగళవారం చేగుంటలో మీడియాతో మాట్లాడుతూ.. దౌల్తాబాద్ లో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు మంత్రి కేటీఆర్ అమెరికాలో బాత్రూంలు కడుగుతున్నారని విమర్శించారు.

ALSO READ : సిరిసిల్లలో ఇంటింటికి తిరిగి ఓటడగాలని ఉంది : కేటీఆర్​

కేసీఆర్​లేకపోతే కేటీఆర్ తలపైన రూపాయి బిల్లా పెడితే పావలాకు కూడా ఎవరూ కొనుగోలు చేయరన్నారు. మంత్రిగా ఉన్న కేటీఆర్​ సభ్యత, సంస్కారం లేకుండా, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, తనకు తల్లిదండ్రులు, పార్టీ సంస్కారం నేర్పించిందని, అడ్డదిడ్డంగా మాట్లాడటం రాదన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్, ఓబీసీ మోర్చా నాయకుడు భూమలింగం గౌడ్, గణేశ్, స్వామి, సిద్ధిరాములు, సుజాత, లావణ్య, రఘువీరా రావు, ప్రతాప్ రెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు.