త్వరలోనే హరీశ్, వెంకట్రామిరెడ్డి జైలుకు పోతరు

త్వరలోనే హరీశ్, వెంకట్రామిరెడ్డి జైలుకు పోతరు

సిద్దిపేట రూరల్, వెలుగు: బీఆర్ఎస్ సమావేశానికి హాజరైన చిరుద్యోగులపై చర్యలు తీసుకున్న సిద్దిపేట కలెక్టర్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. గురువారం సిద్దిపేటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, కోమటి చెరువు వద్ద ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ వాకర్స్​తో మాట్లాడారు. ఎన్నో ఏండ్లు కలెక్టర్​గా, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో మీటింగ్ పెట్టవద్దన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. 

106 మంది ప్రభుత్వ ఉద్యోగుల పొట్టకొట్టింది బీఆర్ఎస్ నాయకులే అని, ఆ ఉద్యోగులను హరీశ్ రావు సైతం కాపాడలేడన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల్లో గెలవడం కోసం ఉద్యోగులను పావులుగా వాడుకున్నారన్నారు. వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ మీద ప్రేమతో ఎంపీగా పోటీ చేస్తలేడని, బీఆర్ఎస్ లీడర్లే బలవంతంగా పోటీ చేయిస్తున్నారన్నారని ఆరోపించారు.  అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో ఏ ప్రయోగం చేసిండో అదే ప్రయోగం చేద్దామని అనుకున్న హరీశ్ రావు ప్రయత్నం బెడిసికొడుతుందన్నారు. 

రూ.100 కోట్ల ఖర్చుచేస్తానని చెబుతున్న వెంకట్రామిరెడ్డి 2021 నుంచి ఎమ్మెల్సీగా ఎక్కడ నిధులు ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు హరీశ్ 
ట్రాప్​లో పడవద్దని హితవు పలికారు. కేసీఆర్‌ కుటుంబంలో ఒక్కరిద్దరు ఇప్పటికే జైలుకు పోయారని, త్వరలో హరీశ్ రావు, వెంకట్రామిరెడ్డి, మిగతావాళ్లు కూడా పోతారన్నారు. కేజ్రీవాల్ లాంటివాళ్లు మనకొద్దని అన్నాహజారేలే కావాలన్నారు. అలే నరేంద్ర తర్వాత మెదక్ పార్లమెంట్ పై బీజేపీ జెండా ఎగురుతుందని, మూడో సారి నరేంద్రమోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దినేశ్, రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు వేణుగోపాల్, శంకర్, వెంకన్న పాల్గొన్నారు.