
మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ లపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సెటైర్ వేశారు. బీజేపీ వాళ్లు సంగారెడ్డికి వస్తే.. హరీశ్ రావు భయపడి అమెరికాకు పారిపోతే.. కేటీఆర్ లండన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగిని పర్మినెంట్ చేస్తానన్న కేసీఆర్ .. ఇంత వరకు ఒక్కరిని కూడా పర్మినెంట్ చేయలేదన్నారు. ఉమ్మడి మెదక్ లో ఎంత మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఎంత మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారో హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే హరీశ్ అమెరికాకు వెళ్లారని అన్నారు.
ఉమ్మడి మెదక్ లో బొల్లారం, జిన్నారం వంటి పెద్ద పరిశ్రమలు ఉన్నా జిల్లా వాసులకు ఉద్యోగాలు రాలేదని విమర్శించారు రఘునందన్ రావు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులకు కంపెనీల్లో ఫోర్త్ క్లాస్ ఉద్యోగాలిస్తున్నారని ధ్వజమెత్తారు.
సంగారెడ్డిలో కాషాయ జెండ ఎగరడం ఖాయమన్నారు రఘునందన్ రావు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 610 జీవో అమలు చేసి స్థానికులకే ఉద్యోగులు వచ్చేలా చేస్తామన్నారు. అలాగే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.