
అహ్మదాబాద్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లు ప్రమాదంలో ఉన్నప్పుడు రిజల్ట్ వచ్చే పిచ్‌లపైనే ఆడాలని ఏ జట్టయినా కోరుకుంటుందని ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. బోర్డర్-–-గావస్కర్ ట్రోఫీలో స్పిన్‌కు అనుకూలిస్తున్న వికెట్లపై ఆటను సమర్థించుకున్నాడు. సిరీస్‌లో ఇప్పటిదాకా జరిగిన మూడు టెస్టులూ రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. మూడో టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన ఇండోర్ పిచ్‌కు ఐసీసీ మ్యాచ్ రిఫరీ ‘పూర్’ రేటింగ్ ఇచ్చాడు. ‘ఈ విషయంలో నేను లోతుగా వెళ్లదల్చుకోలేదు. మ్యాచ్ రిఫరీ తన అభిప్రాయం చెప్పేశారు. దీనికి నేను ఏకీభవించినా, లేకపోయినా అది పెద్ద విషయం కాబోదు.
నేను ఏం ఆలోచిస్తున్నానన్నది ఇక్కడ అనవసరం. కానీ, డబ్ల్యూటీసీ పాయింట్లు కోల్పోయే ప్రమాదంలో ఉన్నప్పుడు మనం రిజల్ట్ వచ్చే వికెట్లపై ఆడాల్సి ఉంటుంది’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. టెస్టు ఫార్మాట్‌లో కొన్నేళ్లుగా పిచ్‌లు కఠినంగా ఉంటున్నాయన్నది వాస్తవమే అని రాహుల్ ఒప్పుకున్నాడు. ప్రపంచం అంతటా అలాంటి వికెట్లనే చూస్తున్నామని చెప్పాడు. 2021లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో చివరి రోజు ఇండియా తొమ్మిది వికెట్లు పడగొట్టలేకపోవడం వల్లే ఇప్పుడు టర్నింగ్ వికెట్లకు మొగ్గు చూపినట్లు పరోక్షంగా వెల్లడించాడు. విజయానికి 12 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లే వస్తున్నప్పుడు ఎవ్వరైనా విజయాన్నే కోరుకుంటారని రాహుల్ చెప్పాడు.