న్యూఢిల్లీ: టీమిండియా లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఈసారి సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. యూరోపియన్ టీ20 లీగ్ (ఈటీపీఎల్)లో డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు ఓనర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ మేరకు తన కొత్త ప్రయాణం గురించి ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు యజమానిగా ఉన్నప్పటికీ మైదానంలో ఆటగాళ్ల నిర్ణయాల్లో తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేశాడు. తమ జట్టుకు కెప్టెన్‌గా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నట్లు తెలిపాడు. ‘క్రికెట్ సంబంధిత నిర్ణయాల్లో నేను తలదూర్చను. కెప్టెన్‌గా, మెంటార్‌గా అశ్విన్‌కు పూర్తి స్వేచ్ఛనిస్తా.
డగౌట్‌లోగానీ, ప్రాక్టీస్ సెషన్‌లోగానీ నేను కనిపించను. అశ్విన్ తనదైన శైలిలో జట్టును నడిపించేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తా. నేను కేవలం ఫ్రాంచైజీ నిర్వహణపైనే దృష్టి పెడతా’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. మూడు దశాబ్దాల పాటు ఆటగాడిగా, కోచ్‌గా క్రికెట్‌తో అనుబంధం ఉన్నప్పటికీ, జట్టు యజమానిగా ఉండటం తనకు కొత్త అనుభవమన్నాడు.
‘ఇది నాకు ఒక కొత్త సరిహద్దు. ఈ రంగంలో నేర్చుకోవాల్సింది, ఎదగాల్సింది చాలా ఉంది. అదృష్టవశాత్తూ నాకు ఈ అవకాశం దక్కింది’ అని ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. గతంలో వివిధ రకాల యజమానులను చూసిన అనుభవం ఇప్పుడు తనకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
