ఆదివాసీలను అడవి దాటనివ్వట్లే.. న్యాయ్ యాత్రలో బీజేపీపై రాహుల్​ ఫైర్

ఆదివాసీలను అడవి దాటనివ్వట్లే.. న్యాయ్ యాత్రలో బీజేపీపై రాహుల్​ ఫైర్

మజులీ: గిరిజనులను అడవులకే పరిమితం చేయాలని బీజేపీ కోరుకుంటున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిచారు. వారికి విద్యా ఇతర అవకాశాలను దూరం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలను మొదటి నివాసులుగా గుర్తిస్తూ.. భూమి, నీరు, అడవిపై వారికి మొదటి హక్కు కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు. భారత్​జోడో న్యాయ్ యాత్ర యాత్ర ఆరో రోజు శుక్రవారం.. అస్సాంలో రెండో రోజు మజులీలో కొనసాగింది.

ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ఆదివాసీల బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గిరిజనులను అడవులకే పరిమితం చేయాలనుకుంటోందన్నారు. వారి పిల్లలకు చదువులు, వర్సిటీలు, ఇంగ్లిష్ విద్య, వ్యాపారాలు వంటి అవకాశాలను దూరం చేయాలని చూస్తున్నదన్నారు. “మీవన్నీ మీకే ఇవ్వాలని కాంగ్రెస్​ భావిస్తుంది. మీ నేల.. మీ నీరు.. మీ అడవులు మీకే సొంతం అవుతాయి” అని ఆదీవాసీలను ఉద్దేశించి రాహుల్ అన్నారు. 

గిరిజనుల భూములు గుంజుకుంటున్నరు

దేశవ్యాప్తంగా గిరిజనుల భూములను బీజేపీ ప్రభుత్వం గుంజుకుంటున్నదని రాహుల్​ఆరోపించారు. ‘ దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మీ భూములు లాక్కుంటున్నరు. మీ చరిత్రను తుడిచివేస్తున్నరు. ఈ మాట నిజం’ అని అన్నారు. ‘బీజేపీ మణిపూర్‌‌ను తగలబెట్టింది. నెలల తరబడి అక్కడ ఒకరినొకరు చంపుకోవడంతో అంతర్యుద్ధం లాంటి దారుణ పరిస్థితి నెలకొంది. అయినా ప్రధాన మంత్రి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదు. నాగాలాండ్‌‌లో ఒప్పందం కుదుర్చుకుంటామని తొమ్మిదేండ్ల కింద ప్రధాని హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పటికీ నెరవేర్చలేదు. అసోంలో ఆ పార్టీకి  చెందిన సీఎం అత్యంత అవినీతిపరుడు’’ అని ఆరోపించారు.

న్యాయ్ యాత్రపై కేసు నమోదు

న్యాయ్ యాత్రపై శుక్రవారం అస్సాంలో కేసు నమోదైంది. గురువారం అస్సాంలోని జోర్హాట్ పట్టణంలో పర్మిషన్​ లేని రూట్​లో యాత్ర చేశారని నిర్వాహకులు కేబీ బైజుపై పోలీసులు కేసు పెట్టారు.

బ్రహ్మపుత్రలో పడవ ప్రయాణం

మజులీలో మీటింగ్ తర్వాత రాహుల్ కమలాబరి చరియాలిలోని వైష్ణవ క్షేత్రమైన శ్రీ శ్రీ ఔనియతి సత్రాన్ని సందర్శించారు. జోర్హాట్ సమీపంలోని నిమతిఘాట్ నుంచి పడవల్లో రాహుల్ సహా కాంగ్రెస్ నాయకులు బ్రహ్మపుత్రా నదిలో ప్రయాణిస్తూ అఫలాముఖ్ ఘాట్‌‌కు వెళ్లారు. అక్కడి నుంచి కమలాబరి చరియాలి వెళ్లారు సంప్రదాయ ధోతి ధరించి సత్రానికి వెళ్లారు.