దేశ సంపదను కొల్లగొడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపణ

దేశ సంపదను కొల్లగొడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపణ

లండన్: ఇండియాలోని ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతున్నదని, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా.. నిలదీసినా వారు టార్గెట్ అవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. దీనికి చక్కటి ఉదాహరణే ఇటీవల బీబీసీపై ఇన్​కం ట్యాక్స్ డిపార్ట్​మెంట్ చేసిన సర్వే అని తెలిపారు. ఇండియన్ జర్నలిస్టుల అసోసియేషన్(ఐజేఏ) శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఓ ప్రోగ్రాంలో రాహుల్ మాట్లాడారు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకం కావడానికి చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇండియా నిరుద్యోగం కారణంగా ఒత్తిడికి గురవుతున్నదని తెలిపారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, దేశ సంపదను కొల్లగొడుతున్నారని, మహిళలపై దాడులు జరుగుతున్నాయని వివరించారు. 

న్యాయ వ్యవస్థనూ వదల్లేదు!

‘‘ప్రజా సమస్యలపై ఏ పార్టీ, ఏ సంస్థ నిలదీసినా వాటిపై దాడులు జరుగుతున్నాయి. 2002 గుజరాత్ అల్లర్ల టైంలో అప్పుడు సీఎంగా ఉన్న మోడీపై బీబీసీ ‘‘ఇండియా: ది మోడీ క్వొశ్చన్” డాక్యుమెంటరీ రూపొందించింది. ఇది యూకే, ఇండియాలో వివాదాస్పదమైంది. దీన్ని మనసులో పెట్టుకుని ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఆఫీసులపై మోడీ ప్రభుత్వం ఐటీ డిపార్ట్​మెంట్​తో సర్వే చేయించింది. డాక్యుమెంటరీ ప్రదర్శనపై బ్యాన్ విధించింది’’ అని రాహుల్ చెప్పారు. తొమ్మిదేండ్లుగా ఇండియాలో ఇదే జరుగుతోందని, న్యాయ వ్యవస్థ, పార్లమెంట్, రాజ్యాంగంపై కూడా దాడి జరుగుతోందని విమర్శించారు. సామాన్యుడి గొంతు వినిపించడం కష్టంగా మారిందన్నారు.

దాడులే.. జర్నలిస్టులకు రివార్డులు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లిన మీడియా సంస్థలపై దాడులు జరుగుతున్నాయని, జర్నలిస్టులను బెదిరిస్తున్నారన్నారు. వారిపై దాడులు చేస్తున్నారని రాహుల్ అన్నారు. ప్రభుత్వాన్ని ఎవరు నిలదీసినా వారికి ఇలాంటి బహుమతులే అందుతున్నాయని విమర్శించారు. అమెరికా, యూరప్​తో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు. ‘‘ఇండియా సైలెంట్​గా ఉండాలని బీజేపీ కోరుకుంటున్నది. ఎందుకంటే ప్రజల దృష్టి మరల్చి దేశ సంపదను నలుగురైదుగురు ఫ్రెండ్స్​కు దోచిపెట్టడమే వారి ఆలోచన”అని రాహుల్ విమర్శించారు.

దేశాన్ని అవమానించింది నేను కాదు..

కేంబ్రిడ్జి యూనివర్సిటీలో తన ప్రసంగంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. దేశాన్ని అగౌరవ పరిచింది తాను కాదని, మోడీనేనని చెప్పారు. ప్రధాని హోదాలో విదేశీ పర్యటనకు వెళుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 60, 70 ఏండ్లలో  అభివృద్ధి అనేదే జరగలేదని మోడీ చెప్పారు. మరో సందర్భంలో భారత దేశం అవినీతిలో కూరుకుపోయిందని విదేశీ గడ్డపై మోడీ వ్యాఖ్యానించారని చెప్పారు. నా మాటలను వక్రీకరించడం బీజేపీ నేతలకు అలవాటే, అందులో భాగమే తాజా ప్రచారం అని రాహుల్​ తెలిపారు.