జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించండి: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ

జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించండి: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు రాహుల్ గాంధీ. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి పూర్తి రాష్ట్ర హోదా కల్పించడానికి రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చట్టం తీసుకురావాలని కోరారు. అలాగే లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద చేర్చడానికి ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని లేఖలో పేర్కొన్నారు. 

గత ఐదు సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతున్నారని గుర్తు చేశారు. ఈ డిమాండ్ చట్టబద్ధమైనదని, వారి రాజ్యాంగ, ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. గతంలో కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్ర హోదా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం దేశంలో ఇదే తొలిసారని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్‎కు తిరిగి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అనేక సందర్భాల్లో చెప్పారు.. కానీ నేటీకి ఆ వాగ్ధానం అమలు చేయలేదని లేఖలో ప్రస్తావించారు.

 వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్‎కు తిరిగి రాష్ట్ర హోదాను పునరుద్ధరించబడుతుందని సుప్రీంకోర్టుకు కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇకనైనా ఇచ్చిన హామీ మేరకు జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి పూర్తి రాష్ట్ర హోదా కల్పించడానికి రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా, 2025, జూలై 21 నుంచి 2025, ఆగస్ట్ 21 వరకు వర్షకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. 2025 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా ఆగస్టు 13, 14 తేదీలలో ఉభయ సభలకు సెలవు ఉండనుంది.