హత్రాస్‌‌లో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్ట్

హత్రాస్‌‌లో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్ట్

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌‌లోని హత్రాస్‌‌కు బయల్దేరిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పోలీసులు అడ్డుకున్నారు. అత్యాచారానికి గురైన యువతి కుటుంబీకులను కలవడానికి వెళ్తున్న రాహుల్ కాన్వాయ్‌‌ను పోలీసులు నిలిపివేశారు. దీంతో రోడ్డు మార్గంలో రాహుల్, ప్రియాంక నడక ప్రారంభించారు. వందలాది పార్టీ మద్దతుదారులతో కాలినడకన వెళ్తున్న రాహుల్‌‌‌, ప్రియాంకను పోలీసులు మళ్లీ అడ్డుకొని అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని రాహుల్ మండిపడ్డారు.

‘నన్ను ఓ పోలీసు నెట్టేశాడు. నాపై లాఠీచార్జ్ చేసి కింద పడేశారు. నేనొక్కటే అడగదల్చుకున్నా.. ఈ దేశంలో కేవలం మోడీజీ ఒక్కరే నడవాలా? మామూలు వ్యక్తులు నడవొద్దా? మా వెహికిల్స్‌‌ను ఆపేశారు. దీంతో మేం నడుచుకుంటూ వెళ్లాం. నన్ను ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారో చెప్పాలి’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై నిరసనలు, ఆందోళనలు ఊపందుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌‌లోని హత్రాస్ జిల్లా కేంద్రానికి సమీపంలోని బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల యువతిపై అదే ఊరికి చెందిన అగ్ర కుల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి వెన్నుపూస, ఇతర ఎముకలు విరిగేలా దారుణంగా కొట్టడంతో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. కనీసం యువతి మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించకుండా పోలీసులే దహనం చేయడం దారుణమని అందరూ మండిపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని పలు రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి.