
- ఆర్థిక సర్వే కూడా నిర్వహిస్తం: రాహుల్ గాంధీ
- అటవీ హక్కుల చట్టాన్ని బలోపేతం చేస్తామని హామీ
ముంబై : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే కులగణన, ఆర్థిక సర్వే అమలు చేస్తామని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాల హయాంలో బలహీనంగా మారిన అటవీ హక్కుల చట్టాన్ని బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర మంగళవారం గుజరాత్ నుంచి మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఇక్కడి గిరిజనులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో గిరిజనులు 8 శాతం ఉన్నారని, అభివృద్ధి ఫలాల్లో వారికి సరైన వాటా దక్కేలా చేస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరను ఇవ్వడానికి చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘అటవీ హక్కుల చట్టాలు, భూ సేకరణ చట్టాలను బీజేపీ ప్రభుత్వాలు బలహీనంగా మార్చాయి. మేము అధికారంలోకి వస్తే వాటిని బలోపేతం చేయడంతో పాటు ఒక్క ఏడాదిలోనే గిరిజనుల క్లెయిమ్స్ పరిష్కారం అయ్యేలా చూస్తాం. అటవీ హక్కుల చట్టం కింద వేల గిరిజనుల క్లెయిమ్స్‌ను బీజేపీ ప్రభుత్వాలు అన్యాయంగా తిరస్కరించాయి. గిరిజనులు అడవుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. గిరిజనులను ఆదివాసీలని అనకుండా వనవాసులు అని పిలుస్తున్నాయి. ఆదివాసీలంటే భూమి, నీరు, అడవులకు యజమానులను అర్థం. మిమ్మల్ని (గిరిజనులు) అలా పిలవకుండా వనవాసులు అని పిలుస్తూ మీ వనరులను బీజేపీ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి” అని రాహుల్ వ్యాఖ్యానించారు.
గుజరాత్లో తన యాత్ర అనుభవాల గురించి వివరిస్తూ.. గుజరాత్ ప్రభుత్వం సమకూర్చుకున్న భూముల్లో 20% గిరిజనులు, బీసీలకు చెందినవే అని చెప్పారు. కార్పొరేట్ కంపెనీల్లో కూడా గిరిజనుల ప్రాతినిధ్యం లేదని, దేశంలోని 90 ఐఏఎస్ అధికారుల్లో ఒక్కరే గిరిజన అధికారి ఉన్నారని ఆయన తెలిపారు. మరోవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ.16 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలను మాఫీ చేసిందని ఆయన మండిపడ్డారు.