
పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ బయోలో మార్పులు చేశారు. గతంలో మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఎంపీ అని ఉండగా ఇప్పుడు దానిని మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, డిస్క్వాలిఫైడ్ ఎంపీ గా మార్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఇంటిపేరుతో దూషించిన కేసులో మార్చి 23న సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన క్రమంలో ఆయనపై అనర్హత వేటు పడింది.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ మార్చి 26 న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజ్ ఘట్ వద్ద సత్యగ్రహ దీక్షను ప్రారంభించింది. పోలీసుల అనుమతి లేనప్పటికీ దీక్షలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. రాజ్ఘట్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని ఇప్పటికే పోలీసులు తెలపారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు సంఘీభావంగా మార్చి 25న దేశవ్యాప్తంగా గాంధీ విగ్రహాల ఎదుట నిరసన చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.