ఆదివాసీలకు అండగా ఉంటం :రాహుల్ గాంధీ

ఆదివాసీలకు అండగా ఉంటం :రాహుల్ గాంధీ
  • జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడుతం: రాహుల్ గాంధీ

ధన్​బాద్ (జార్ఖండ్): ఆదివాసీలకు అండగా ఉంటా మని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆదివాసీల నినాదమైన ‘జల్ జంగల్ జమీన్’ కోసం పోరాడతామని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా జార్ఖండ్ లోని ధన్ బాద్ జిల్లాలో ఆదివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ యువత భవిష్యత్తును నాశనం చేసింది. ఆర్థిక అసమానతలు, నోట్ల రద్దు, జీఎస్టీ, నిరుద్యోగం.. యువత భవిష్యత్తును నాశనం చేశాయి” అని అన్నారు. తాము అధికారంలోకి వస్తే దేశంలో విద్యాభివృద్ధికి, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కాగా, శనివారం రాత్రి ధన్ బాద్ జిల్లాలోని తుండిలో బస చేసిన రాహుల్.. ఆదివారం ఉదయం గోవింద్ పూర్ 
నుంచి యాత్రను ప్రారంభించారు. 

16న యూపీలోకి రాహుల్ యాత్ర.. 

భారత్ జోడో న్యాయ్ యాత్రకు తమకు ఆహ్వానం అందలేదని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించగా, దానిపై కాంగ్రెస్ స్పందించింది. ఉత్తరప్రదేశ్ లో రాహుల్ యాత్ర రూట్ ఇంకా ఖరారు కాలేదని, అది ఫైనల్ అయినంక అందరికీ ఆహ్వానాలు పంపిస్తామని తెలిపింది. ‘‘ఉత్తరప్రదేశ్ లో జరగాల్సిన న్యాయ్ యాత్ర రూట్ మ్యాప్ రెడీ అవుతున్నది. అది ఒకట్రెండు రోజుల్లో ఫైనల్ అవుతుంది. అది పూర్తయ్యాక ఇండియా కూటమిలోని పార్టీలకు ఆహ్వానం పంపిస్తాం. వాళ్లందరూ యాత్రలో పాల్గొంటేనే కూటమి బలం పెరుగుతుంది” అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్వీట్​ చేశారు. దీనికి అఖిలేశ్ వీడియోను ట్యాగ్ చేశారు. కాగా, రాహుల్ యాత్రలో పాల్గొంటారా? అని అఖిలేశ్​ను మీడియా ప్రశ్నించగా.. ‘‘అసలు సమస్య ఏమిటంటే.. పెద్ద పెద్ద ఈవెంట్లు జరుగుతాయి. కానీ మాకు ఆహ్వానం అందదు” అని కామెంట్ చేశారు.