ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు
  • అదానీకే హెల్ప్ చేయాలని దేవుడు ఎందుకు చెప్తున్నడు?
  • గౌతమ్ అదానీ కోసమే మోదీ పనిచేస్తున్నరని ఫైర్
  • రైతుల కష్టాలు ప్రధానికి పట్టవు
  • దేవుడు ఏం చెప్తే మోదీ అదే చేస్తున్నరంటూ ఎ

చండీగఢ్: కార్పొరేట్ కంపెనీల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పని చేస్తున్నారని లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రైతుల కష్టాలేవీ ఆయనకు పట్టవని మండిపడ్డారు. కేవలం గౌతమ్ అదానీకి మాత్రమే హెల్ప్ చేయాలని ఆ దేవుడు ‘నాన్ బయోలాజికల్’ ప్రధాని మోదీకి ఎందుకు చెప్తున్నాడో అసలు అర్థం కావడం లేదని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అంబాలాలో నిర్వహించిన రోడ్​షోలో రాహుల్ మాట్లాడారు. ‘‘ప్రజల ఇన్​కమ్ స్టేటస్​ను ప్రభుత్వ ఏజెన్సీలు ఇష్టమొచ్చినట్లు మారుస్తున్నాయి. 

దీంతో వాళ్లకు ప్రభుత్వ పథకాలు దక్కకుండా పోతున్నాయి. ఒకవేళ లబ్ధిదారుగా ఉంటే వారి పేర్లను అధికారులు తొలగిస్తున్నారు. ఇలాంటి ఎంతో మంది బాధితులను నేను కలిశాను. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని హర్యానా ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేదు? ఎన్నికల టైమ్​లోనే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తారు. తామేం చెప్పాలనుకున్నారో చెప్పేసి వెళ్లిపోతారు. కానీ, ఇక్కడి వాళ్ల సమస్యలు మాత్రం వినరు’’ అని రాహుల్ విమర్శించారు. 

అదానీ సూచన మేరకే  అగ్నిపథ్ తీసుకొచ్చిన్రు

తాను సాధారణ మనిషిని కాదని, నాన్ బయోలాజికల్ అని ప్రధాని మోదీ చెప్పిన విషయం అందరికీ తెలుసని రాహుల్ అన్నారు. ‘‘తనకు దేవుడితోనే డైరెక్ట్ లింక్స్ ఉన్నాయని మోదీ చెప్పారు. దేవుడు చెప్పిందే తాను చేస్తానని కూడా అన్నారు. రైతులు, ప్రజలను పట్టించుకోకుండా.. అదానీకే సాయం చేయాలని దేవుడు ఆదేశించినట్లు ఉన్నారు. ఆయన కూడా అదే చేస్తున్నారు’’ అని రాహుల్ అన్నారు. గౌతమ్ అదానీ సూచన మేరకే అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చారని విమర్శించారు. అగ్ని వీరుల జేబుల్లోని పెన్షన్ డబ్బులు దోచుకుని అదానీ జేబులు నింపుతున్నారని మండిపడ్డారు. 

సాధారణ జవాన్​కు జీవితాంతం పెన్షన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. అగ్నిపథ్ స్కీమ్​తో యువతను కూలీలుగా మార్చేశారని మండిపడ్డారు. అగ్ని వీరుల పెన్షన్, అమరవీరుల హోదాతో పాటు భవిష్యత్తును లాక్కునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక అగ్నివీర్ స్కీమ్​ను రద్దు చేస్తామని తెలిపారు.