ఆయన మౌనం దేశానికే చేటు.. దేశానికి నిజం తెలియాలని మళ్లీ మళ్లీ అడుగుతున్నా: రాహుల్​

ఆయన మౌనం దేశానికే చేటు.. దేశానికి నిజం తెలియాలని మళ్లీ మళ్లీ అడుగుతున్నా: రాహుల్​

న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‎పై కాంగ్రెస్​ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ విమర్శలపర్వం కొనసాగిస్తున్నారు. జైశంకర్​ మౌనం దేశానికే చేటు అని మండిపడ్డారు. ఆపరేషన్​సిందూర్ గురించి పాకిస్తాన్‎కు ముందే సమాచారం ఇవ్వడం వల్ల భారత్​ ఎన్ని విమానాలు కోల్పోయిందో జైశంకర్​ చెప్పడం లేదన్నారు. ఆయన మౌనం వహించడం తీవ్రమైనదే కాదు.. అది నేరమని పేర్కొన్నారు. సోమవారం రాహుల్​ గాంధీ ‘ఎక్స్’​ వేదికగా జైశంకర్​పై విరుచుకుపడ్డారు. దేశానికి నిజం తెలియాలనే తాను పదే పదే ఈ ప్రశ్న అడుగుతున్నానని రాహుల్ ​అన్నారు.

అయినా జైశంకర్​ నుంచి ఎలాంటి సమాధానం రావడంలేదని అసహనం వ్యక్తంచేశారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి ముందే ఉగ్రవాద లాంచ్‌‌ ప్యాడ్‌‌లపై దాడి చేస్తున్నామని, పాక్‌‌ సైన్యం వాటికి దూరంగా ఉండాలని భారత్‌‌ చెప్పినట్లు జైశంకర్‌‌ పేర్కొన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అలా చేయడం వల్ల పాకిస్తాన్​అప్రమత్తమైందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి జైశంకర్​ మాట్లాడిన ఓ వీడియోను రాహుల్​ రీపోస్ట్​ చేశారు.  రాహుల్​ఆరోపణలను కాంగ్రెస్ నేత పవన్​ఖేరా సమర్థించారు. 

దాడుల గురించి పాకిస్తాన్‎కు ముందే సమాచారం ఇచ్చినట్టు జైశంకర్​మాట్లాడారని అన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‎కు ఎలాంటి సంబంధం ఉన్నదని ప్రశ్నించారు. ఇది దౌత్యం కాదని, గూఢచర్యం అని ఆరోపించారు. పాకిస్తాన్​కు దాడి సమాచారం తెలియడంతోనే మసూద్​అజార్, హఫీజ్​సయీద్ లాంటి టెర్రరిస్ట్​లీడర్లు తప్పించుకున్నారని అన్నారు. దీనికి ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్​ తప్పనిసరిగా సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. 

దురుద్దేశంతోనే రాహుల్ వ్యాఖ్యలు: బీజేపీ

విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. జైశంకర్​ మాటలను రాహుల్ గాంధీ వక్రీకరిస్తున్నారని మండిపడింది. దురుద్దేశంతోనే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నది. రాహుల్ గాంధీ పాకిస్తాన్​భాష మాట్లాడుతున్నారని విమర్శించింది. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే రాహుల్​గాంధీ గత తప్పిదాల నుంచి ఏమీ నేర్చుకోనట్టు కనిపిస్తున్నదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్​జోషి ఎద్దేవా చేశారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని ఇండియన్​ఎయిర్​ఫోర్స్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపినా.. ఆయన సాయుధ బలగాలను పదే పదే అవమానిస్తూ ఉన్నారని విమర్శించారు.