
యూజీసీ-నెట్ రద్దు, నీట్ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ విద్యార్థుల భవిష్యత్ ను గందరగోళంలో పడేసిందని అన్నారు. నీట్ పరీక్ష పేపర్ కూడా లీక్ అయ్యిందని దాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని ఆయన విద్యాశాఖను డిమాండ్ చేశారు.
యూనివర్సిటీలను భారతీయ జనతా పార్టీ స్వాధీనం చేసుకుందని.. అందుకే పేపర్ లీకులు జరుగుతున్నాయని రాహుల్ విమర్శించారు. మెరిట్ ఆదారంగా యూనివర్సిటీ చాన్సలర్లను నియమించలేదని.. ఓ సంస్థ నియమాలకు కట్టుబడి ఉన్నవారిని విశ్వవిద్యాలయాల చాన్సులర్లుగా నియమించారని ఆయన ఎద్దేవా చేశారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నెట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ నిలదీశారు. రష్యా, -ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపారని చెబుతున్నారని.. కానీ భారతదేశంలో జరిగే పేపర్ లీక్‌లను ఆపలేకపోయారని ప్రధానిపై సెటైర్ వేశారు రాహుల్ గాంధీ. బీజేపీ రాజకీయాలు విద్యాసంస్థల్లోకి చేరి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందని ఆయన అన్నారు.
మోదీ నోట్ల రద్దుతో విద్యావ్యవస్థను నాశనం చేశారు. ఇప్పుడు పేపర్ లీకులతో విద్యావ్యవస్థను కూల్చేస్తున్నారని అన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)ని జూన్ 18న ఈసారి పెన్- అండ్-పేపర్ మోడ్‌లో నిర్వహించారు.- దీనికి 11 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకొన్నారు. పరీక్ష జరిగిన ఒక్కరోజులోనే రద్దు చేస్తున్నట్లు బుధవారం NTA ప్రకటించింది.