
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ అంశంపై లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత గురువారం రాహుల్ గాంధీ.. ఇండియా కూటమిలోని ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నేత సుప్రియా సూలేతో కలిసి స్పీకర్ ఓం బిర్లాతో ఆయన చాంబర్‌లో సమావేశమయ్యారు. ఎమర్జెన్సీపై స్పీకర్ సభలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి అసంతృప్తి వ్యక్తం చేశారు.
అది పూర్తిగా రాజకీయ అంశమని, దానిపై మాట్లాడకుండా ఉండాల్సిందని రాహుల్ పేర్కొన్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో చెప్పారు. అది మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ ఎమర్జెన్సీ అంశాన్ని స్పీకర్ వద్ద రాహుల్ లేవనెత్తారని తెలిపారు. బుధవారం ఓం బిర్లా స్పీకర్‌గా వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ సభలో తీర్మానాన్ని చదివి వినిపించారు.
అలాగే, ఆ టైంలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల జ్ఞాపకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూసభ వెల్ లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా గురువారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారు. ఇది రాజ్యాంగంపై అతిపెద్ద దాడి అని, దేశ చరిత్రలో చీకటి అధ్యాయమని పేర్కొన్నారు.