కాంగ్రెస్​లోనే ప్రజాస్వామ్యం .. బీజేపీ అంటేనే డిక్టేటర్​షిప్: రాహుల్ గాంధీ

కాంగ్రెస్​లోనే ప్రజాస్వామ్యం .. బీజేపీ అంటేనే డిక్టేటర్​షిప్: రాహుల్ గాంధీ
  • కార్యకర్తలు చెప్పింది  కాంగ్రెస్​హైకమాండ్ కూడా వింటది
  • బీజేపీ ఎంపీల మనసంతా కాంగ్రెస్​లోనే ఉన్నది
  • బీజేపీలో బానిసత్వం గురించి ఆ పార్టీ వాళ్లే చెప్పిన్రు
  • ఎన్​డీఏకు ఓటమి భయం పట్టుకున్నది
  • నాగ్​పూర్ మెగా ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యలు

నాగ్ పూర్/న్యూఢిల్లీ:   దేశంలోని వ్యవస్థలన్నింటినీ బీజేపీ ధ్వంసం చేస్తున్నదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పోరాటం బీజేపీపైనే అని స్పష్టం చేశారు. కొంతమంది బీజేపీలో ఉన్నప్పటికీ వాళ్ల మనసంతా కాంగ్రెస్ పైనే ఉందన్నారు. అధికారం కోసం ఆ పార్టీ కుట్రలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. బీజేపీలో ఇప్పటికీ రాచరిక వ్యవస్థే ఉందన్నారు. కాంగ్రెస్ లో మాత్రమే ప్రజాస్వామ్యం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో ‘మనం సిద్ధంగా ఉన్నాం’ (హై తయ్యార్ హమ్) పేరుతో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ర్యాలీలో పాల్గొన్న ఆయన బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో నిరుద్యోగం 40 ఏండ్ల గరిష్టానికి చేరుకుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను కేంద్రం తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నది. మేము అధికారంలోకి వస్తే కులగణన చేపడ్తాం. బీజేపీ ఎంపీల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ పార్టీలో పెద్దలు చెప్పిందే కార్యకర్తలు వినాలి.. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం కింది స్థాయి కార్యకర్తల మాటే వింటుంది. వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటుంది. ఇదే.. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న తేడా. దేశం కోసం కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత జరిగిన అభివృద్ధి చూస్తే కాంగ్రెస్ ఏం చేసిందో అర్థమవుతుంది. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పార్టీ పోరాడింది. స్వాతంత్ర్యం కోసం నెహ్రూ, గాంధీ జైలుకు వెళ్లారు. కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసింది. స్వాతంత్ర్యం కోసం బీజేపీ ఏం చేసింది?” అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

నచ్చినా.. నచ్చకపోయినా చేయాల్సిందే..

బీజేపీలో నేతలు, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ఆ పార్టీ ఎంపీ తనకు వివరించినట్లు రాహుల్  తెలిపారు. ‘‘బీజేపీలో గులాంగిరీ మాత్రమే నడుస్తదని ఆ పార్టీ ఎంపీయే నాకు చెప్పాడు. అతని పేరు నేను చెప్పను. ఆ ఎంపీ బీజేపీలో ఉన్నా.. అతని మనసు మాత్రం కాంగ్రెస్​తోనే ఉంది. బీజేపీ హైకమాండ్ సూచనలు నచ్చినా.. నచ్చకపోయినా.. అమలు చేయాల్సిందే అని చెప్పాడు. మరో అవకాశం ఉండదట.. పార్టీలో బానిసల్లా పని చేయాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీనే నాకు ప్రైవేట్​గా కలిసినప్పుడు వివరించాడు” అని రాహుల్ వివరించారు. అపొజిషన్ పార్టీ లీడర్లపై రాజకీయంగా కక్ష సాధించేందుకు కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు ఏజెన్సీలపై ఒత్తిడి పెంచుతున్నదని ఆరోపించారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతున్నదన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2024 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీని దృష్టిలో పెట్టుకునే నియామకాలు

యూనివర్సిటీల్లో వీసీల నియామకాలు ప్రతిభ ఆధారంగా జరగడం లేదని రాహుల్ విమర్శించారు. ఆర్గనైజేషన్​, రాజకీయ పార్టీని దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఓ నేతగా కొనసాగుతున్నందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఎన్​డీఏ, ఇండియా కూటముల మధ్య జరుగుతున్నది రాజకీయ పోరాటమని, అధికారం కోసం కాదన్నారు. రెండు వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన కూటముల మధ్య పోరాటం జరుగుతున్నదని వివరించారు. వ్యవస్థలను నాశనం చేస్తున్న బీజేపీపైనే తమ పోరాటమన్నారు. రైతులపై కూడా జీఎస్టీ విధిస్తున్నదని కేంద్రంపై మండిపడ్డారు.

ప్రశ్నిస్తే.. ఎంపీలను సస్పెండ్ చేశారు: ఖర్గే

ఒక వైపు బాబా సాహెబ్ అంబేద్కర్​కు చెందిన ఐడియాలజీ ఉంటే.. మరోవైపు దేశాన్ని నాశనం చేసే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘‘పార్లమెంట్​లో ప్రతిపక్షాల గొంతును బీజేపీ నొక్కేస్తున్నది. పార్లమెంట్ వింటర్ సెషన్​లో మెజార్టీ సభ్యులను సస్పెండ్ చేసింది. పార్లమెంట్​లో దాడి ఘటనపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారు. నిందితులకు బీజేపీ ఎంపీనే పాస్ జారీ చేశారు. ఒక ఎంపీని కాపాడుకునేందుకు 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి బయటికి పంపించారు. అయినా.. మా పోరాటం ఆగదు’’అని ఖర్గే స్పష్టం చేశారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి విస్మరించలేని చరిత్ర ఉందన్నారు. పార్టీ పరంగా వందేండ్లు పూర్తి చేసుకున్న తరుణంలో అందరూ ఒకేచోట చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని అన్నారు. వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

1885లో కాంగ్రెస్ ఆవిర్భావం.. 

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్​సీ)ను 1885, డిసెంబర్ 28న ఇంగ్లీష్ బ్యూరోక్రాట్ అలన్ ఆక్టేవియన్ హ్యూమ్​ స్థాపించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు కాంగ్రెస్ నాయకత్వం వహించింది. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో అధికారంలోకి వచ్చింది. ఏఓ హ్యూమ్.. దేశ ప్రజలకు స్వయం పాలన గురించి వివరించారు. బొంబాయిలోని గోకుల్​దాస్ తేజ్​పాల్ సంస్కృత కళాశాలలో కాంగ్రెస్ మొదటి సెషన్ ఏర్పాటు చేశారు. దీనికి 72 మంది సంఘ సంస్కర్తలు, రిపోర్టర్లు, అడ్వకేట్లు వచ్చారు. స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ లో ఎంతో మంది ప్రముఖులు పని చేశారు. వారిలో గాంధీ, అంబేద్కర్ వంటి వాళ్లు సభ్యులుగా ఉండి దేశానికి సేవ చేశారు.