డబుల్ ఇంజన్ సర్కార్​లను న్యాయం అడిగితే నేరమే: రాహుల్

డబుల్ ఇంజన్ సర్కార్​లను  న్యాయం అడిగితే నేరమే: రాహుల్

న్యూఢిల్లీ/జైపూర్: డబుల్  ఇంజన్  బీజేపీ ప్రభుత్వాల్లో న్యాయం అడిగితే నేరం చేసినట్లే అని కాంగ్రెస్  మాజీ చీఫ్ రాహుల్  గాంధీ అన్నారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లో ఇటీవల ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటనలపై ట్విట్టర్ లో ఆయన స్పందించారు. ‘‘గత నెలలో యూపీలోని కాన్పూర్ లో ఓ సోదరిపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత తన స్వగ్రామంలోని ఓ ఇటుకల బట్టీ వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. అలాగే మధ్యప్రదేశ్ లో ఓ మహిళను రేప్  చేశారు. అవమాన భారం తట్టుకోలేక ఆమె కూడా సూసైడ్  చేసుకుంది. తమపై అత్యాచారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు న్యాయం కోసం ఎంతగా విజ్ఞప్తి చేసినా బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బాధితులనే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా శత్రువులుగా చూశారు. 

మధ్యప్రదేశ్ లో అత్యాచారానికి గురైన తన భార్యకు న్యాయం జరగకపోవడంతో ఆమె భర్త కూడా పిల్లలతో కలిసి ఉరేసుకున్నారు. డబుల్  ఇంజన్  ప్రభుత్వాల్లో న్యాయం కోరడమంటే నేరం చేసినట్లే అని ఈ ఘటనలతో తెలుస్తోంది” అని రాహుల్  పేర్కొన్నారు. హత్రాస్, ఉన్నావ్, మాందసౌర్, పౌరీల్లో అత్యాచార బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ‘‘అన్యాయంపై అందరూ గళం ఎత్తాలి. లేకపోతే ఈరోజు కాకపోయినా రేపైనా ఆ నిప్పు మన ఇంటిని కాల్చేస్తుంది. నారీకి న్యాయం జరగాలి” అని రాహుల్  ట్వీట్  చేశారు. అలాగే రాహుల్  సోదరి ప్రియాంకా వాద్రా కూడా ఉత్తర ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జంగిల్  రాజ్ లో మహిళగా పుట్టడం నేరంగా మారిందన్నారు.

గెలిస్తే 30 లక్షల ఉద్యోగాలిస్తం: రాహుల్

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అలాగే క్వశ్చన్  పేపర్ల లీకేజీ నివారణకు చట్టం చేస్తామని రాహుల్  హామీ ఇచ్చారు. రాజస్థాన్ లోని భాన్ స్వారాలో భారత్  జోడో న్యాయ యాత్రలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ గెలిస్తే రైతుల పంటలకు కనీస మద్దతు ధర అమలు చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పిస్తామని, స్టార్టప్ లకు రూ.5 వేల కోట్లు ఇస్తామన్నారు. డిప్లొమా, డిగ్రీ హోల్డర్ లకు ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఏడాది పాటు పని పొందే హక్కు (రైట్ టు అప్రెంటిస్ షిప్) కల్పిస్తామని, ఆ టైంలో వారికి రూ.లక్ష చెల్లిస్తామని చెప్పారు. దేశంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మోదీ ప్రభుత్వం భర్తీ చేయలేకపోతున్నదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. గుజరాత్ లోకి రాహుల్ యాత్ర ప్రవేశం రాహుల్  గాంధీ భారత్  జోడో న్యాయ్  యాత్ర గురువారం రాజస్థాన్  నుంచి గుజరాత్ లోకి ప్రవేశించింది. రాష్ట్రంలోని దోహాద్  జిల్లాలోని ఝాలోద్  పట్టణానికి ఆయన చేరుకున్నారు. స్థానిక కాంగ్రెస్  నేతలతో పాటు ఆప్  నాయకులు, ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు.