రెజ్లర్ల కన్నీళ్లకూ కరగని క్రూరత్వమా?.. ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్

రెజ్లర్ల కన్నీళ్లకూ కరగని క్రూరత్వమా?.. ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ: రెజ్లర్ల నిరసనల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్​ చేస్తూ ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. దేశాన్ని కాపాడాల్సిన ప్రధానిలో ఇంతటి క్రూరత్వం చూడటం బాధేస్తోందన్నారు. “దేశంలో ప్రతి ఆడబిడ్డకు మొదటగా ఆత్మాభిమానం వస్తుంది. ఆ తర్వాతే పథకాలు, అవార్డులు లభిస్తాయి. 

స్వయం ప్రకటిత బాహుబలికి ఈ వీరుల కన్నీళ్ల విలువ కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయా? ప్రధాని అంటే దేశాన్ని కాపాడాల్సినోడు. ఆయనలో ఇంతటి క్రూరత్వం చూస్తుంటే బాధగా ఉంది” అని రాహుల్ పీఎం మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. రెజ్లింగ్ సమాఖ్యలో ఇటీవల జరిగిన పరిణామాలకు నిరసనగా ఇండియన్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన ఖేల్ రత్న, అర్జున అవార్డులను ప్రధానికి వాపస్ ఇచ్చేందుకు శనివారం బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె ఆ అవార్డులను ఢిల్లీలోని కర్తవ్య్​ పథ్​లో వదిలేశారు. అనంతరం వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.