
న్యూఢిల్లీ/అమేథీ: ఉత్తరప్రదేశ్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసిందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలోని యువత ‘నిరుద్యోగ వ్యాధి’తో బాధపడుతున్నారని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ లో నిరుద్యోగులకు డబుల్ మోసం జరిగిందని కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలను ఉద్దేశించి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో రాహుల్ పోస్టు పెట్టారు.
‘‘ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఏండ్లకేండ్లు భర్తీ చేయడం లేదు. ఒకవేళ భర్తీ చేసినా పేపర్లు లీక్ అవుతున్నాయి. ఒకవేళ పరీక్షలు సవ్యంగా జరిగినా, ఫలితాలు ఆలస్యమవుతున్నాయి. చివరికి ఫలితాలు వచ్చినా జాబ్‌లో చేరడానికి చాలా రోజులు ఆగాల్సి వస్తున్నది. తరచూ కోర్టులకు వెళ్లాల్సి వస్తున్నది” అని అందులో పేర్కొన్నారు. ‘‘ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏండ్లకేండ్లు ఎదురుచూసి ఏజ్ బార్ అయిపోయి అనర్హులుగా మిగిలిపోతున్నారు. దీంతో మానసికంగా కుంగిపోతున్నారు.
దాని నుంచి బయటకొచ్చి, ఉద్యోగాల కోసం పోరాడితే.. పోలీసుల లాఠీ దెబ్బలు తినాల్సి వస్తున్నది” అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ప్రతి స్టూడెంట్‌కు జాబ్ అనేది కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు. అది ఒక కల.. ఆ స్టూడెంట్ జీవితంతో పాటు అతని కుటుంబ స్థితిగతులను మార్చే కల. ఈ సర్కార్ అలాంటి కలలను నాశనం చేసి, వాళ్ల కుటుంబాల ఆశలను ఆడియాసలు చేస్తోంది” అని ఫైర్ అయ్యారు. యువతకు న్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని, తమ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ల కలలు నెరవేరుతాయని పేర్కొన్నారు.
ఇయ్యాల అమేథీలోకి రాహుల్ యాత్ర..
రాహుల్ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఆదివారం ప్రయాగ్ రాజ్‌లో కొనసాగింది. శనివారం సాయంత్రం వయనాడ్‌కు వెళ్లిన రాహుల్.. ఆదివారం సాయంత్రం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని యాత్రను కొనసాగించారు. రాహుల్ యాత్ర సోమవారం అమేథీ నియోజకవర్గంలోకి ఎంటర్ కానుంది. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ యాత్రలో పాల్గొననున్నారు.