వెరీ ఇంట్రస్టింగ్: చెరువులో దూకి.. చేపలు పట్టి.. బిహార్లో రాహుల్ ఎన్నికల ప్రచారం

వెరీ ఇంట్రస్టింగ్: చెరువులో దూకి.. చేపలు పట్టి.. బిహార్లో రాహుల్ ఎన్నికల ప్రచారం
  • ప్రధాని మోదీపై విమర్శల దాడి
  • అంబానీ, అదానీ చేతిలో కీలుబొమ్మ అంటూ ఫైర్​
  • ట్రంప్​కు భయపడి పాక్​తో యుద్ధం ఆపేశారని విమర్శ
  • ఎన్నికల్లో ఏం చేయమన్నా చేస్తరు
  • బిహార్ ఎన్నికల ర్యాలీల్లో మోదీపై ప్రతిపక్ష నేత కామెంట్లు

బెగుసరాయ్/ఖగాడియా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం బెగుసరాయ్ లో మత్స్యకారులను కలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా వారితో కలిసి చెరువులో దూకి చేపలు పట్టారు. ముందుగా పడవలో చెరువు మధ్యకు వెళ్లిన ఆయన సడెన్ గా నీటిలోకి జంప్ చేశారు. ఎద లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి.. మత్స్యకారులతో కలిసి వల వేసి చేపలు పట్టారు. రాహుల్ వెంట వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) చీఫ్ ముకేశ్ సాహ్నీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ కూడా ఉన్నారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఓట్ల కోసం డ్రామాలు ఆడతారని, హామీలు ఇచ్చి.. ఎన్నికల తర్వాత ముఖం చాటేస్తారని విమర్శించారు. ‘‘మోదీ స్పీచ్ లు ఇస్తారు. హామీలు ఇస్తారు. మీరు ఏం అడిగితే అది చేస్తానని ఎన్నికలు జరిగే రోజు వరకూ చెప్తారు. కానీ ఎన్నికలు అయిపోగానే ఆయన మళ్లీ రారు. మీ సమస్యలు కూడా పట్టించుకోరు. అందుకే, మీకేం కావాలో ఇప్పుడే సాధించుకోండి” అని బిహార్ ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. 

ఆదివారం బిహార్ లోని బెగుసరాయ్, ఖగాడియా జిల్లాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. ‘‘ఓట్ల కోసం ప్రధాన మంత్రి ఏదైనా చేస్తారు. మీరు యోగా చేయాలని చెప్పండి. కొన్ని ఆసనాలు వేసి చూపిస్తారు. కానీ ఎన్నికల తర్వాత మొత్తం పాడటం, ఆడటం అన్నీ అదానీ, అంబానీల ద్వారా జరుగుతాయి. ఇదంతా పూర్తిగా ఒక డ్రామా” అని విమర్శించారు.

‘‘ఛాతీ పెద్దగా ఉన్నంత మాత్రాన బలవంతులు కారు. మహాత్మాగాంధీ చూడటానికి బలహీనంగా ఉండేవారు. కానీ బ్రిటిష్  పాలకులను పారదోలారు. 56 ఇంచుల ఛాతీ అని చెప్పుకునే మోదీ మాత్రం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అంటే భయపడ్డారు. అందుకే ట్రంప్ చెప్పగానే పాకిస్తాన్​పై ఆపరేషన్ సిందూర్​ను రెండు రోజుల్లోనే ఆపేశారు. 1971లో నాటి ప్రధాని ఇందిరా గాంధీకి అమెరికా నుంచి బెదిరింపులు వచ్చాయి. కానీ ఆమె భయపడలేదు. ఏం చేయాలో అది చేశారు. నిజానికి ట్రంప్ కు మోదీ భయపడటం మాత్రమే కాదు.. అదానీ, అంబానీలు ఆడించినట్టల్లా ఆడతారు” అని రాహుల్ కామెంట్స్ చేశారు.

కార్పొరేట్ల కోసమే మోదీ సర్కారు 
ప్రధాని మోదీ సర్కారులో జీఎస్టీ, డీమానిటైజేషన్ వంటి అన్ని ప్రధాన నిర్ణయాలూ చిరు వ్యాపారులను దెబ్బతీసి, తనకు ఇష్టమైన కొందరు కార్పొరేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేందుకే జరిగాయని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘యువత రీల్స్ చూడాలని మోదీ చెప్తారు. నిరుద్యోగం వంటి నిజమైన సమస్యలపై ప్రశ్నించకుండా వారిని డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తారు. బీజేపీ సర్కారు చీప్ గా ఇంటర్నెట్ ఇస్తోందని, మీరు రీల్స్ చేస్తూ, చూస్తూ ఉండాలని అంటారు. కానీ మీరు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో రీల్స్ చూస్తే అంబానీకి డబ్బులు వెళ్తాయి” అని చెప్పారు.

కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్ లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూర్తిగా ఓట్ల చోరీకి పాల్పడ్డాయని రాహుల్ ఆరోపించారు. బిహార్ లోనూ మహాఘట్​బంధన్ మద్దతుదారులను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారని, దీనిపై తమ వద్ద ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వస్తే  చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. 

ఫోన్లపై మేడ్ ఇన్ చైనా లేబుల్స్ ను రీప్లేస్ చేస్తామని, మేడ్ ఇన్ బిహార్ టీషర్టులు వచ్చేలా చూస్తామన్నారు. బిహార్ లో మహాఘట్​బంధన్ కూటమి అధికారంలోకి వస్తే నలంద విశ్వవిద్యాలయం తరహాలో ప్రపంచస్థాయి యూనివర్సిటీని స్థాపించి, నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. ప్రపంచ దేశాల నుంచి సైతం విద్యార్థులు వచ్చి ఇక్కడ అడ్మిషన్లు పొందేలా యూనివర్సిటీని తీర్చిదిద్దుతామన్నారు.