దేశ సంపద కొందరి చేతుల్లోకే.. హార్వార్డ్ వర్సిటీ స్టూడెంట్లతో రాహుల్ గాంధీ

దేశ సంపద కొందరి చేతుల్లోకే.. హార్వార్డ్ వర్సిటీ స్టూడెంట్లతో రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందుతోందని, కానీ సంపద మాత్రం కొందరి చేతుల్లోకే పోతోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. సంపద పెరుగుతున్నా దేశ ప్రజలకు పంపిణీ జరగట్లేదని చెప్పారు. అమెరికాలోని హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన పలువురు స్టూడెంట్లు ఇటీవల తనను కలిసిన సందర్భంగా ఆయన ఇంటరాక్షన్ అయ్యారు. 

ఆ వీడియోను రాహుల్ శనివారం ట్విట్టర్​లో షేర్ చేశారు. గత పదేండ్లలో భారతదేశ ఆర్థిక అభివృద్ధి గురించి ఓ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు దాని వల్ల ఎవరికి ప్రయోజనం జరుగుతోందన్నది చూడాలి. ఇండియాను తీసుకుంటే దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. దేశం అభివృద్ధి చెందుతోంది. 

కానీ సంపద కొందరి చేతుల్లోకే పోతోంది. ఇక్కడ ప్రధాని మోదీకి ఇండస్ట్రీయలిస్ట్ అదానీ సన్నిహితుడని అందరికీ తెలుసు. దేశంలోని అన్ని పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇప్పుడు అదానీ చేతిలోనే ఉన్నాయి. ఇలాంటి విధానంతో గ్రోత్ ఉంటుంది కానీ సంపద పంపిణీ జరగదు” అని రాహుల్ వివరించారు. ఇదే విషయాన్ని ఎన్నికల్లో చెప్పడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటూ మరో స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. మీడియా, న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించినప్పుడు, ఆర్థిక వనరులు అందుబాటులో ఉన్నప్పుడు, సంస్థలన్నీ న్యూట్రల్​గా ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుందన్నారు. 

ప్రతిపక్షంపై నిఘా పెట్టిన్రు.. 

భారత్​లో ప్రజాస్వామ్యం ఎంతమాత్రం లేదని హార్వర్డ్ స్టూడెంట్లతో రాహుల్ అన్నారు. ‘‘నా సోషల్ మీడియా అకౌంట్లను పూర్తిగా కంట్రోల్ చేస్తున్నారు. నా ట్విట్టర్, యూట్యూబ్ ఇతర అకౌంట్లపై నిఘా పెట్టారు. మొత్తం ప్రతిపక్షంపైనే నిఘా కొనసాగుతోంది” అని ఆయన ఆరోపించారు. అమెరికాలో వర్ణ వివక్ష మాదిరిగా ఇండియాలో కుల వివక్ష ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉందన్నారు. 

మణిపూర్, జమ్మూకాశ్మీర్ మంటల్లో తగలబడుతున్నాయని, తమిళనాడులో మరో సమస్య నెలకొందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇండియాను రాష్ట్రాల సమాఖ్యగా చూడకుండా.. ఒకే సిద్ధాంతం, ఒకే మతం, ఒకే భాష కలిగిన దేశంగా చూడటం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్నారు.