ఆపరేషన్ సిందూర్‌‌..భద్రతా దళాలకు సెల్యూట్: రాహుల్ గాంధీ

ఆపరేషన్ సిందూర్‌‌..భద్రతా దళాలకు సెల్యూట్: రాహుల్ గాంధీ
  • ఆపరేషన్ సిందూర్‌‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు
  • మన భద్రతా దళాలకు సెల్యూట్: రాహుల్, ఖర్గే 

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. అలాగే, భారత భద్రతా దళాలకు తాము సెల్యూట్ చేస్తున్నామని ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్‌‌ తర్వాత బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ వర్కింగ్​కమిటీ సమావేశమైంది. అనంతరం రాహుల్, ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 22న జరిగిన ఘోరమైన పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించి.. పాకిస్తాన్‌‌కు తగిన సమాధానం ఇచ్చిన మన భద్రతా దళాలను చూసి మేము గర్విస్తున్నామని పేర్కొన్నారు. పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు ధైర్యంగా, నిర్ణయాత్మకంగా స్పందించాయని అన్నారు. 

"మన వీర సైనికుల ధైర్యసాహసాలకు, దేశభక్తికి మేము సెల్యూట్ చేస్తున్నాము" అని వారు పేర్కొన్నారు. పాకిస్తాన్‌‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై సైనిక దాడులు చేసిన భారత దళాలకు పూర్తి మద్దతు, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, గురువారం జరగనున్న అఖిలపక్ష సమావేశానికి తమకు ఆహ్వానం అందిందని వారు పేర్కొన్నారు. ఆ సమావేశానికి తాము హాజరవుతామని స్పష్టం చేశారు. ‘‘ఇది దేశానికి సంబంధించిన విషయం. మేము మొదటి నుంచీ చెబుతున్నాం. ఇలాంటి సమయాల్లో మనం ఐక్యంగా ఉండాలి. దేశ ప్రయోజనాల కోసం ఏ సమావేశానికి పిలిచినా మేము హాజరవుతాము" అని వారు తెలిపారు.