అంశుమన్ ఫ్యామిలీకి కాంగ్రెస్​ అండ

అంశుమన్ ఫ్యామిలీకి కాంగ్రెస్​ అండ
  • లక్నోలో కెప్టెన్ కుటుంబ సభ్యులను కలిసిన రాహుల్ గాంధీ
  • అగ్నివీర్ స్కీం సరైంది కాదు,రద్దు చేయండి: అంశుమన్ తల్లి
  • సైన్యాన్ని రెండుగా విభజించవద్దని కేంద్రానికి అభ్యర్థన

రాయ్‌‌బరేలి: కీర్తిచక్ర పురస్కార గ్రహీత కెప్టెన్ అంశుమన్ సింగ్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిసి మాట్లాడారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం రాహుల్ యూపీలో పర్యటించారు. ఉదయం లక్నోకు చేరుకున్న ఆయన అంశుమన్ సింగ్ కుటుంబాన్ని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత అంశుమన్ తల్లి మంజు సింగ్​ మీడియాతో మాట్లాడుతూ అగ్నివీర్​ స్కీమ్​ సరైంది కాదన్నారు.

సైన్యాన్ని రెండు వర్గాలుగా విభజించవద్దని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. నాలుగేండ్ల తర్వాత ఆర్మీ ఇంటికి పంపించిన అగ్నివీరులు, వారికి సరిపడే కెరీర్ లభించక ఇబ్బందులు పడతారని అన్నారు. అగ్నివీర్ పథకం సైన్యానికి తగినది కాదని.. దాన్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు రాహుల్ గాంధీ కూడా చెప్పారని ఆమె పేర్కొన్నారు.

ఆ తర్వాత రాహుల్ లాల్​గంజ్​లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. రాయ్​బరేలీ వెళ్తూ బచ్రావాన్ సమీపంలోని చుర్వ హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. ఇండియా సంతోషం, శాంతి, శ్రేయస్సు కోసం హనుమంతుడిని ప్రార్థించినట్టు తెలిపారు. రాయ్​బరేలికి చేరుకొని ఎయిమ్స్ ను సందర్శించారు. తర్వాత గెస్ట్ హౌస్​లో ఐఐఏ ప్రతినిధులతో సమావేశమయ్యారు.