వయనాడ్​లో రాహుల్ నామినేషన్

వయనాడ్​లో రాహుల్ నామినేషన్
  •      సిట్టింగ్ సీటు నుంచి మళ్లీ బరిలోకి కాంగ్రెస్ మాజీ చీఫ్ 
  •     ఘనంగా స్వాగతించిన క్యాడర్
  •     శశిథరూర్, ఇతర లీడర్లూ నామినేషన్ల దాఖలు
  •     కర్నాటకలో నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖులు

వయనాడ్ (కేరళ) : కాంగ్రెస్ మాజీ చీఫ్​రాహుల్ గాంధీ కేరళలోని తన సిట్టింగ్ లోక్ సభ స్థానం వయనాడ్ నుంచి పోటీకి బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ వెంట ఆయన సోదరి, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, దీపా దాస్, కన్హయ్య కుమార్, ఇతర నేతలు వయనాడ్ జిల్లా కలెక్టర్ (రిటర్నింగ్ ఆఫీసర్) కార్యాలయానికి భారీగా తరలి వచ్చారు. కన్నూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వయనాడ్ చేరుకున్న రాహుల్.. రాహుల్ భారీ రోడ్ షో చేస్తూ కలెక్టర్ ఆఫీసుకు వచ్చారు. 

రోడ్ షోలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి నేతలు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని రాహుల్ కు గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా నిలబడిన పార్టీ కార్యకర్తలు ‘జై జై రాహుల్ గాంధీ’, ‘డౌన్ డౌన్ నరేంద్ర మోదీ’ అంటూ నినాదాలు చేశారు. రోడ్ షో ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయనాడ్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలిచానన్నారు. 

కొండలతో కూడిన వయనాడ్ జిల్లా ప్రజల సమస్యలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేశానని తెలిపారు. నామినేషన్ వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్న పోరాటమన్నారు.  

ప్రత్యర్థులుగా సురేంద్రన్, యానీ రాజా..

వయనాడ్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఆ పార్టీ స్టేట్ చీఫ్ కె.సురేంద్రన్, సీపీఐ నుంచి ఆ పార్టీ అగ్ర నేత డి.రాజా భార్య యానీ రాజా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ లోక్ సభ ఎన్నికలకు సెకండ్ ఫేజ్​లో కేరళ అంతటా 
ఏప్రిల్ 26న ఒకే రోజున పోలింగ్ జరగనుంది.   

తిరువనంతపురంలో శశిథరూర్..

కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళలోని తిరువనంతపురం లోక్ సభ స్థానం సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ మరోసారి అదే నియోజకవర్గం నుంచి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. శశిథరూర్ ఇప్పటివరకు ఇదే సెగ్మెంట్ నుంచి మూడు సార్లు గెలిచారు. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయడం ఇది వరుసగా నాలుగోసారి. ఈ ఎన్నికల్లో తిరువనంతపురం స్థానంలో సీపీఐ నుంచి పన్నియన్ రవీంద్రన్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. అలాగే సీపీఎం సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కె.రాధాకృష్ణన్ అలత్తూర్ నుంచి, బీజేపీ నేషనల్ సెక్రటరీ అనిల్ ఆంటోనీ పఠణంథిట్ట నుంచి నామినేషన్ వేశారు.

బెంగళూరు నార్త్​లో శోభా కరంద్లాజే..

కర్నాటకలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే బెంగళూర్ నార్త్ స్థానంలో నామినేషన్ వేశారు. కర్నాటక మంత్రి హెచ్ సీ మహదేవప్ప కొడుకు సునీల్ బసే చామరాజనగర్ నుంచి కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. కర్నాటక బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కె. జయప్రకాశ్ హెగ్డే ఉడుపి-చిక్ మగళూర్ నుంచి కాంగ్రెస్ తరఫులో నామినేషన్ వేశారు.