వాజ్​పేయికి రాహుల్​గాంధీ నివాళి

వాజ్​పేయికి రాహుల్​గాంధీ నివాళి

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రకు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఢిల్లీలోని మహాత్మా గాంధీ స్మారకంతో పాటు, పలువురు మాజీ ప్రధానుల స్మృతివనాలను సందర్శించారు. ఉదయాన్నే గాంధీ స్మారకం రాజ్​ఘాట్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్మారకం విజయ్​ఘాట్​ను సందర్శించి నివాళి అర్పించారు. ఆపై మాజీ ప్రధానులు జవహర్​లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీల స్మారక చిహ్నాలైన శాంతి వనం, శక్తి స్థల్, వీర్​భూమి వద్ద నివాళి అర్పించారు. అలాగే సదైవ్ అటల్ వద్దకు చేరుకుని మాజీ పీఎం అటల్ బిహారీ వాజ్​పేయికి కూడా రాహుల్ పూలు చల్లి నివాళులర్పించారు. మొదట జోడో యాత్ర ఢిల్లీకి చేరుకోగానే మాజీ ప్రధానులకు శనివారమే నివాళులర్పించాలని ఆయన అనుకున్నప్పటికీ..  సోమవారం ఉదయానికి మార్చారు.

నిజాయితీ ముందు అవినీతి మోకరిల్లుతోంది: బీజేపీ

ఓ పక్క కాంగ్రెస్​ నేతలు వాజ్​పేయిపై అసభ్యకరంగా ఆరోపణలు చేస్తరు.. మరోవైపు రాహుల్ అటల్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తరు.. ఇదంతా రాహుల్ ఆడుతున్న డ్రామా అని బీజేపీ ఫైర్ అయింది. నిజాయితీకి, దేశం పట్ల అంకితభావానికి వాజ్​పేయి ప్రతిరూపమని, అలాంటి నిజాయితీ ముందు అవినీతి(రాహుల్) మోకరిల్లుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. ‘‘వాజ్​పేయి నిజాయితీకి ప్రతిరూపం. శాంతి దూత. రాహుల్ గాంధీ విద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో, దేశం పరువు తీయడంలో కూరుకుపోయి ఉన్నోడు”అని భాటియా కామెంట్ చేశారు.

వాజ్​పేయిని బ్రిటిష్ కోవర్టు అని ఆరోపిస్తూ ఆదివారం నాడు కాంగ్రెస్ లీడర్ గౌరవ్ పాండి చేసిన ట్వీట్​పై బీజేపీ మరో అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. ‘‘పాండి చేసిన ట్వీట్​ను తొలగించారు కానీ, అది సరిపోదు. ఆయనను మీ పార్టీ నుంచి తప్పించాలి. కాంగ్రెస్​ తన స్టాండ్​ను స్పష్టం చేసి క్షమాపణ చెప్పాలి. లేదంటే పాండి చేసిన ఆరోపణలు రాహుల్ గాంధీ మాటలని నమ్మే పరిస్థితి వస్తుంది”అని పూనావాలా పేర్కొన్నారు. బీజేపీ నేతల ట్వీట్లపై కాంగ్రెస్ స్పందించింది. పాండి చేసిన ట్వీట్​ను తొలగించారని, రాహుల్​గాంధీ వైఖరి, కాంగ్రెస్ స్టాండ్​ ఒకటేనని పేర్కొంది.