అక్కడ మోడీ చేసిందే.. ఇక్కడ కేసీఆర్ చేస్తుండు : రాహుల్

అక్కడ మోడీ చేసిందే.. ఇక్కడ కేసీఆర్ చేస్తుండు : రాహుల్

ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం ఆయన బీహెచ్ఈఎల్, బీఈఎల్ సహా పలు సంస్ధల కార్మికులతో ముచ్చటించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందనే భయం కార్మికుల్లో ఉందన్నారు. పబ్లిక్ సంస్ధలను కొంతమంది వ్యాపారస్తులకు కట్టబెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు, ఎల్ ఐసీ, టెలికాం, పైప్ లైన్స్ ఇలాంటి ఎన్నో విభాగాలను కేంద్రం ప్రైవేటుపరం చేసిందని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రైతులు పోరాటం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని రాహుల్ సూచించారు. ఎలాంటి భయం వద్దని..ప్రైవేటు పరం చేయనీయకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందని హామీ ఇచ్చారు. 

భయాందోళనలు నెలకొనాలనే ఉద్ధేశంతో...

దేశంలో భయాందోళనలు నెలకొనేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం దేశ ఆర్ధిక వ్యవస్ధను కూలగొట్టారని విమర్శించారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు రాకుండా చేశారన్నారు. నోట్ల రద్దుతో పేద మధ్య తరగతి, వ్యవసాయ కార్మికులపై దెబ్బ కొట్టారని వివరించారు. జీఎస్టీని తీసుకొచ్చి.. ఇతర రంగాలను చావు దెబ్బ కొట్టారని తెలిపారు. దీని ఫలితంగా దేశంలో ఉపాధి లేకుండా పోయిందన్నారు. గతంలో కర్ణాటకలోని బళ్లారిలో 4 లక్షల మంది జీన్స్ రంగంలో ఉపాధి పొందేవారని రాహుల్ గుర్తు చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ తీసుకురావడంతో 40 వేల మంది మాత్రమే ఇప్పుడు అక్కడ పని చేస్తున్నారని వెల్లడించారు. దేశంలోని ప్రతి రాష్ట్రం.. ప్రతి నగరంలో ఇలాంటి పరిస్థితే ఇప్పుడు నెలకొందన్నారు. 

ధరణి పోర్టల్ లో మొదటి స్థానంలో కేసీఆర్
 
ప్రధాని మోడీ ఏం చేస్తే.. సీఎం కేసీఆర్ అదే చేస్తుంటారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రోజూ సాయంత్రం ధరణి వెబ్ పోర్టల్ ఓపెన్ చేసి భూములు ఎవరు కొన్నారు ? ఎవరు అమ్మారు అని సీఎం కేసీఆర్ చెక్ చేసుకుంటారన్నారు. ధరణి పోర్టల్ లో మొదటి స్థానంలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉదయం లేచి ఏ ప్రాజెక్టు రీ కన్ స్ట్రక్షన్ చేయాలి ? కమీషన్ ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై దృష్టి పెడుతారని విమర్శించారు. కమీషన్ల సొమ్మంతా సీఎం కేసీఆర్  కుటుంబానికే పోతోందన్నారు.