పేరుతో కాదు.. కృషితోనే నెహ్రూ ప్రసిద్ధి చెందారు : రాహుల్ గాంధీ

పేరుతో కాదు.. కృషితోనే నెహ్రూ ప్రసిద్ధి చెందారు : రాహుల్ గాంధీ

ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) సొసైటీ పేరును మార్చడంపై కాంగ్రెస్‌ మండిపడింది. మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిపై వివాదం చెలరేగుతున్న వేళ.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ  స్పందించారు. తాను చేసిన కృషితోనే నెహ్రూ ప్రసిద్ధి చెందారని, ఆయన పేరు వల్ల కాదన్నారు రాహుల్. 

కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియానికి ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీ (పీఎంఎంఎల్)గా పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ నేతలు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ ఘాటుగా స్పందించారు.

ప్రధాని మోదీకి చాలా భయాలు, అభద్రతా భావాలు ఉన్నాయని, తొలి ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసిన నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడమే బీజేపీ అజెండాగా పెట్టుకుందని ఆరోపించారు. 

పేరు మార్చడంపై శశిథరూర్‌ కూడా స్పందించారు. ఇతర ప్రధానులకు స్థానం కల్పించేందుకు భారత తొలి ప్రధాని పేరును తీసివేయడం చాలా చిన్న పని అని, దీనిని నెహ్రూ మెమోరియల్‌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీగా పిలుచుకోవచ్చు అంటూ కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను బీజేపీ ఖండించింది. జవహార్‌లాల్‌ నెహ్రూ నుంచి నరేంద్ర మోదీ వరకు ఎంతో మంది ప్రధానమంత్రులు చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించిన అన్ని విషయాలను ఈ మ్యూజియం తెలియజేస్తుందని వివరించింది.