
- కర్నాటకలో ఓట్ల తొలగింపు ప్రయత్నాలు నిజమే
- దానిపై విచారించాలని తామే ఫిర్యాదు చేశామని వెల్లడి
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ద్వారా ఓట్ల తొలగింపు సాధ్యం కాదని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) స్పష్టం చేసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడు, నిరాధారమైనవని పేర్కొంది. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. ‘‘ప్రజలను రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒకరి ఓటును మరొకరు ఆన్‌లైన్ ద్వారా తొలగించలేరు. అలాగే సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా అతని ఓటును తొలగించడమంటూ ఉండదు” అని ఈసీ స్పష్టం చేసింది. ‘‘2023లో కర్నాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ వ్యవహారంపై విచారణ జరపాలని మేమే స్వయంగా ఫిర్యాదు చేశాం. ఈ సెగ్మెంట్ నుంచి 2018లో బీజేపీ అభ్యర్థి సుభద్ గుత్తేదార్ గెలిచారు. 2023లో కాంగ్రెస్ క్యాండిడేట్ బీఆర్ పాటిల్ విజయం సాధించారు” అని పేర్కొంది.