హిమంత.. అత్యంత అవినీతి సీఎం: రాహుల్ గాంధీ

హిమంత.. అత్యంత అవినీతి సీఎం: రాహుల్ గాంధీ

జోర్హాట్(అస్సాం): దేశంలోనే అత్యంత అవినీతి సీఎం హిమంత బిశ్వ శర్మ అని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ  ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కూడా అస్సాం సర్కారే అని విమర్శించారు. ఈ రాష్ట్రంలోనే ప్రజా ధనం ఎక్కువ లూటీ అవుతున్నదని ఫైర్ అయ్యారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లీడర్లు.. ఇక్కడి ప్రజల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొడ్తున్నారని అన్నారు. అస్సాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము  పోరాటం చేస్తామన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం ఐదో రోజున నాగాలాండ్‌‌‌‌లోని తులి నుండి ప్రారంభమైంది. శివసాగర్‌‌‌‌ జిల్లాలోని హలువాటింగ్‌‌‌‌ మీదుగా ఉదయం 9:45 గంటలకు అస్సాంలోకి  ప్రవేశించింది.

అస్సాం కాంగ్రెస్ లీడర్లు రాహుల్​కు జాతీయ జెండా అందజేసి స్వాగతం పలికారు. హలువాటింగ్ వద్ద వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఆయనకు గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. అస్సాంలోని 17 జిల్లాల గుండా ఎనిమిది రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. శివసాగర్, జోర్హాట్ జిల్లాల్లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. ‘‘ఇలాంటి యాత్రలతో కాంగ్రెస్​కు ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నరు. పోయిన ఏడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర.. దేశ రాజకీయాలను మార్చిన విషయం వాళ్లకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ప్రేమను పంచుతుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు మాత్రం విద్వేషాలు రెచ్చగొడతాయి. ఒక వర్గంపై.. మరో వర్గం దాడి చేసేందుకు ఉసిగొల్పుతాయి. ప్రజల నుంచి దోచుకున్న డబ్బులతోనే ఇదంతా చేస్తాయి’’అని రాహుల్ విమర్శించారు. 

సమస్యలన్నీ లేవనెత్తుతాం

దేశాన్ని బీజేపీ నేతలు దోచుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రజలందరూ.. ఆర్థిక, సామాజిక, రాజకీయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వీటన్నింటినీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో లేవనెత్తుతానని చెప్పారు. దేశంలోని ప్రతి మతం, కులాన్ని ఏకం చేయడమే యాత్ర ఉద్దేశమన్నారు. ఇది.. మహా సాధువు శ్రీమంత శంకరదేవ భావజాల యాత్ర అని తెలిపారు. అందరికీ ఆయన మార్గదర్శకులు అని చెప్పారు. అన్ని వర్గాలను ఏకం చేసేందుకు ఎంతో ప్రయత్నించారని గుర్తు చేశారు.

అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, భారత్ జోడో న్యాయ్ యాత్ర అదే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నదని రాహుల్ తెలిపారు. అంతకుముందు, నాగాలాండ్‌‌‌‌లోని మోకోక్‌‌‌‌చుంగ్ నగరంలో జరిగిన ర్యాలీలో కూడా ప్రజలనుద్దేశిస్తూ రాహుల్ మాట్లాడారు. తొమ్మిదేండ్లలో నాగా రాజకీయ సమస్యను పరిష్కరించడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలం అయ్యారని విమర్శించారు. నాగాలాండ్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా, వారితో చర్చించకుండా ఈ సమస్యకు పరిష్కారం దొరకదని స్పష్టం చేశారు. 

అప్లికేషన్లు వదిలేసి రాహుల్ వద్దకు..

మధ్యాహ్నం జోర్హాట్ జిల్లాలోని మరియానీ టౌన్​కు చేరుకున్న రాహుల్​కు లీడర్లు ఘన స్వాగతం పలికారు. ‘ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్’ స్కీమ్​కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్​ల కోసం వందలాది మహిళలు నకచారి పంచాయతీ ఆఫీస్ ముందు నిల్చున్నారు. బస్సు నుంచి రాహుల్ దిగిన వెంటనే.. అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం వదిలేసి ఆయన వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు. రాహుల్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించగా.. ఆయన వద్దంటూ వారించారు. మహిళలందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వారితో సెల్ఫీలు దిగారు. 

గాంధీ ఫ్యామిలీయే.. అత్యంత అవినీతిమయం: హిమంత

దేశంలోనే అత్యంత అవినీతి కుటుంబం ఏదైనా ఉందంటే.. అది గాంధీ ఫ్యామిలీయే అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. తనపై రాహుల్ కామెంట్లను ఆయన ఖండించారు. రాహుల్ ది న్యాయ యాత్ర కాదని.. మియా (అస్సాంలోని బెంగాలీ ముస్లింలను ఉద్దేశించి వాడే అభ్యంతరకర పదం) యాత్ర అని ఎద్దేవా చేశారు. ముస్లింలు ఎక్కువుండే ఏరియాల గుండానే యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని యాత్రలు చేసినా కాంగ్రెస్​కు ఒరిగేదేమీ లేదన్నారు.