ఎంఎస్‌పీ భారం కాదు జీడీపీ వృద్ధికి రైతులను డ్రైవర్లను చేసే మంచి అవకాశం: రాహుల్

ఎంఎస్‌పీ భారం కాదు జీడీపీ వృద్ధికి రైతులను డ్రైవర్లను చేసే మంచి అవకాశం: రాహుల్

న్యూఢిల్లీ: ఎంఎస్‌పీకి చట్టబద్దత కల్పిస్తే దేశ జీడీపీ వృద్ధికి రైతులే డ్రైవర్లు అవుతారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్‌పై భారం పడుతుందనే కారణంతో ఎంఎస్‌పీకి లీగల్ గ్యారంటీ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం అబద్ధాలు చెబుతున్నదని ఆరోపించారు. మంగళవారం ఆయన 'ఎక్స్(ట్విట్టర్)' ద్వారా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. "ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎంఎస్‌పీకి చట్టబద్దత కల్పిస్తామని ఇటీవల కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అప్పటి నుంచి మోదీకి చెందిన మీడియా సంస్థలు ఎంఎస్‌పీపై అబద్ధాల వర్షం కురిపిస్తున్నాయి. బడ్జెట్‌లో సాధ్యం కాదని తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ ప్రకారం.. 2022–23లో  రైతులకు ఎంఎస్‌పీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై కేవలం రూ. 21వేల కోట్ల అదనపు భారం మాత్రమే పడే అవకాశం ఉంది. ఇది మన దేశ మొత్తం బడ్జెట్‌లో 0.4% మాత్రమే. రూ.14 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసి, మరో రూ.1.8 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను మినహాయింపు ఇచ్చిన మన దేశంలో..  రైతుల కోసం ఈ కొంచెం ఖర్చు ఎందుకు పెట్టకూడదు? ఎంఎస్‌పీకి చట్టబద్దత వల్ల వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతాయి. రైతులు నమ్మకంతో వివిధ రకాల పంటలను పండిస్తారు. ఎంఎస్‌పీకి చట్టబద్దత బడ్జెట్‌పై భారం కాదు. జీడీపీ వృద్ధికి రైతులను రూపశిల్పిగా మార్చే ఓ మంచి అవకాశం" అని రాహుల్ గాంధీ వివరించారు.

పరువు నష్టం కేసులో బెయిల్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కామెంట్లకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఆరేండ్ల క్రితం నాటి ఈ కేసులో ఉత్తరప్రదేశ్​లోని సుల్తాన్ పూర్ జిల్లా కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.