
న్యూఢిల్లీ: కోల్‌కతా ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటనతో దేశం షాక్‌కు గురైందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళల్లో అభద్రతా భావం పెరుగుతోందని తెలిపారు.ఈ కేసులో నిందితులను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే ఆసుపత్రి, స్థానిక యంత్రాంగంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని చెప్పారు.
ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి బదులు నిందితుడిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఆసుపత్రి, స్థానిక యంత్రాంగంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ కాలేజీ వంటి ప్రదేశాల్లో డాక్టర్లకు భద్రత లేదని అర్థమవుతోంది. చదువుల కోసం ఆడపిల్లలను వారి తలిదండ్రులు బయటకు ఎలా పంపిస్తారు..? నిర్భయ కేసు తర్వాత కఠిన చట్టాలు రూపొందించినప్పటికీ ఇటువంటి నేరాలను అరికట్టడంలో ఎందుకు విఫలం అవుతున్నాం.
హథ్రాస్ నుంచి ఉన్నావ్, కతువా నుంచి కోల్‌కతా వరకు ఇలా జరగుతున్న ఘటనలపై ప్రతిపార్టీ, సమాజంలోని ప్రతి వర్గం చర్చించాలి. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి అండగా ఉంటా. వారి కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. దోషులను కఠినంగా శిక్షించాలి’’ అని రాహుల్ పేర్కొన్నారు.
మోదీ హయాంలో నిరుద్యోగం పెద్ద శాపం: ఖర్గే
ప్రధాని మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెద్ద శాపంలా మారిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో మోదీ ప్రభుత్వం తప్పుడు గణాంకాలను చెప్తోందని ఆయన మండిపడ్డారు. దేశంలో లక్షలాది మంది యువత తక్కువ జీతం ఇచ్చినా పనిచేయాలని కోరుకుంటున్నారని, అవకాశాల కోసం రోడ్లపై కష్టపడుతున్నారని అన్నారు.
మహారాష్ట్రలో 1,257 మహిళా కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 1.11 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని ఖర్గే ఎక్స్ లో పోస్ట్ చేశారు. వారిలో చాలా మంది పసిపిల్లలతో రాత్రంతా పేవ్‌మెంట్‌పై గడపవలసి వచ్చింది, ఇది తీవ్రమైన నిరుద్యోగ పరిస్థితికి భయంకరమైన రిమైండర్ అని ఆయన అన్నారు. గుజరాత్ తో జులై 15న డైమండ్ వర్కర్స్ యూనియన్ ప్రారంభించిన సూసైడ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఉద్యోగాలు కోల్పోయిన వారి నుండి 1,600 కంటే ఎక్కువ కాల్స్ వచ్చాయని మల్లికార్జున ఖర్గే చెప్పారు.