సీఎం స్టాలిన్​కు రాహుల్ గాంధీ స్వీట్ గిఫ్ట్

సీఎం స్టాలిన్​కు రాహుల్ గాంధీ స్వీట్ గిఫ్ట్
  •     జూన్ 4న స్వీట్ల పండుగ చేస్కుంటామన్న స్టాలిన్
  •     కోయంబత్తూరులో ఇండియా కూటమి తరఫున ప్రచారం

చెన్నై: జూన్ 4 న ఇండియా కూటమి స్వీట్ విక్టరీని సాధిస్తుందని తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొయంబత్తూరులో స్టాలిన్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ అనంతరం రాహుల్.. సింగనల్లూరులో రోడ్డు మధ్యలోని డివైడర్ ను దాటి ఓ స్వీట్ దుకాణానికి వెళ్లారు. రాహుల్ ను చూసి షాక్ అయిన షాపు సిబ్బంది.. ఏం కావాలి సర్? అని అడిగారు. 

దానికి ఆయన స్పందిస్తూ ..'మా బ్రదర్ స్టాలిన్ కోసం మైసూర్ పాక్ కావాలి' అని అడిగారు. ఈ సందర్భంగా షాపులోని మిఠాయిలను రుచిచూశారు. అనంతరం రాహుల్.. షాపులో కొన్న ఆ స్వీట్లను తీసుకుని నేరుగా స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనకు అందించారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఈ వీడియోపై స్టాలిన్ శనివారం స్పందిస్తూ.. రాహుల్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. “నా సోదరుడు రాహుల్ గాంధీ ఇచ్చిన స్వీట్ గిఫ్ట్​తో నా హృదయం నిండిపోయింది. జూన్ 4న  ఇండియా కూటమి కూడా ఇలాంటి తీపి విజయాన్నే అందుకుంటుంది" అని ట్వీట్ చేశారు. 

కుల గణన నిర్వహిస్తం

కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో కుల గణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన.. చత్తీస్‌‌గఢ్‌‌లోని బస్తర్ జిల్లాలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. బస్తర్ లోక్‌‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కవాసి లఖ్మాను గెలిపించాలని ప్రజలను కోరారు. "ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకునేవారికి, దాన్ని నాశనం చేయాలనుకునేవారికి మధ్య పోరు వంటింది. మోదీ పాలనలో 22 మంది వ్యాపారవేత్తలు 70 కోట్ల మంది భారతీయుల సంపదకు సమానమైన ఆస్తిని కూడబెట్టారు. మేం అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తం. యువత కోసం అప్రెంటిస్‌‌షిప్‌‌లను  ప్రారంభిస్తం"  అని రాహుల్ వివరించారు.