వయనాడ్ బాధితులకు ఇండ్లు కట్టించి ఇస్తం

వయనాడ్ బాధితులకు ఇండ్లు కట్టించి ఇస్తం
  • ఎలాంటి సాయానికైనా వెనుకాడం: రాహుల్ గాంధీ
  • ఇక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్త
  • కేంద్రం నుంచి సాయం అడుగుతామని వెల్లడి

వయనాడ్ : కేరళలోని వయనాడ్ విపత్తు బాధితులకు కాంగ్రెస్ తరఫున వందకు పైగా ఇండ్లు కట్టించి ఆదుకుంటామని ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మిగిలిన విపత్తులతో దీన్ని పోల్చొద్దని కేంద్రాన్ని కోరుతానన్నారు. కేరళలో ఇంతటి భయానక విషాదాన్ని మునుపెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎలాంటి సాయం చేసేందుకైనా వెనుకాడబోమని, ఇక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తామని తెలిపారు. రెండ్రోజులుగా ప్రియాంకా గాంధీతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. రిలీఫ్ క్యాంపులను సందర్శించి అక్కడివాళ్లతో మాట్లాడారు. స్థానిక అధికారులతో సమావేశమై, ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘గురువారం నుంచి నేను, ప్రియాంక గాంధీ విపత్తు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం. ఎంత ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందనే దానిపై అధికారులతో మాట్లాడుతున్నాం. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. సీఎం విజయన్​తో కలిసి ఢిల్లీ వెళ్తాం. కేంద్రానికి పరిస్థితి వివరించి సాయం కోరుతాం. వరదల నియంత్రణకు పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేస్తాం. లోక్​సభలోనూ వయనాడ్ బాధితుల తరఫున గళం వినిపిస్తాను. రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారికి అన్ని సౌలత్​లు కల్పించాం. వయనాడ్​ను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరుతున్నా’’ అని అన్నారు. 

330కు పెరిగిన మృతులు

కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 330కు చేరుకున్నది. ఇంకా 220 మంది ఆచూకీ దొరకడం లేదు. 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరు వయనాడ్​లోని పలు హాస్పిటల్స్​లో చికిత్స పొందుతున్నారు. వారం రోజులుగా వయనాడ్​లో వర్షం కురుస్తూనే ఉందని, సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్, స్పెషల్ డ్రోన్లు, థర్మల్ స్కానర్లను అధికారులు ఉపయోగిస్తున్నారు. కాగా, ఏడాది కింద చురల్​మలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని రాసిన స్టోరీ వైరల్​ అవుతుంది. అచ్చం అందులో చెప్పినట్టే ఇప్పుడు విధ్వంసం జరిగింది. ‘‘భారీ వర్షం కురిస్తే కొండ చరియలు విరిగి పడతాయి. అవి జలపాతాలను తాకుతాయి. అక్కడి నుంచి వరదలు ఉప్పొంగుతాయి. దారిలో ఉన్న వాటన్నింటినీ ముంచేస్తాయి. మనుషుల ప్రాణాలూ పోతాయి’’అని ఆ స్టోరీలో రాసింది.  ఇప్పుడు అదే జరిగింది. ఆ విద్యార్థిని చదువుతున్న స్కూల్‌‌‌‌‌‌‌‌ కూడా వరదల్లో ధ్వంసమైంది.

రాష్ట్రాలకు అదనపు విపత్తు నిర్వహణ నిధులు ఇవ్వండి

కేంద్రానికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ ఖర్గే డిమాండ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఎలాంటి వివక్ష లేకుండా అదనపు విపత్తు నిర్వహణ నిధులను అందించాలని ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున ఖర్గే కోరారు. విపత్తు నిర్వహణను మెరుగుపర్చేందుకు శాస్త్రీయ విధానాన్ని అనుసరించి వరదలు, భారీ వర్షాలు, ఆకస్మిక వానలు, కరువు తదితర వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకోవాలని శుక్రవారం ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో విజ్ఞప్తి చేశారు. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో ఆకస్మిక వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా మంది మరణించారనే వార్త బాధ కలిగిందన్నారు.