సీబీఎస్‌‌‌‌ఈ ఫలితాల్లో భారీ అవకతవకలు.. కోఎంప్ట్కు కాంట్రాక్టు ఎట్లిచ్చారంటూ రాహుల్ గాంధీ ఫైర్

సీబీఎస్‌‌‌‌ఈ ఫలితాల్లో భారీ అవకతవకలు.. కోఎంప్ట్కు కాంట్రాక్టు ఎట్లిచ్చారంటూ రాహుల్ గాంధీ ఫైర్
  • గతంలో గ్లోబరీనా పేరుతో తెలంగాణలో ఇదే తరహా తప్పులు
  • 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును 
  • ఆ సంస్థ చేతుల్లో ఎలా పెట్టారని నిలదీత

న్యూఢిల్లీ: సీబీఎస్‌‌ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో భారీ అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్  గాంధీ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈమేరకు బుధవారం ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘సీబీఎస్‌‌ఈ 12 వ తరగతి పరీక్ష ఫలితాల్లో భారీగా అవకతవకలు జరిగాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే మౌనం వీడలేదు. బాధ్యత వహించలేదు, పశ్చాత్తాపం అసలే లేదు’’ అని ఘాటుగా విమర్శించారు. 

విద్యార్థుల ఫలితాలు తారుమారు కావడాన్ని రాహుల్ గాంధీ ఒక వ్యూహాత్మక కుట్రగా అభివర్ణించారు.  సీబీఎస్‌‌ఈ కాంట్రాక్టు దక్కించుకున్న కోఎంప్ట్ సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సంస్థ 2019లో తెలంగాణలో ‘గ్లోబరీనా’ పేరుతో ఇలాంటి తప్పులకే పాల్పడిందని గుర్తు చేశారు.‘‘కోఎంప్ట్ సంస్థ 2019లో తెలంగాణలో ‘గ్లోబరీనా’ పేరుతో ఇలాంటి స్టంట్ చేసింది. పేరు మారింది కానీ, వారి ఉద్దేశం మారలేదు. ఆ సంస్థ గత చరిత్ర అందరికీ తెలిసినప్పటికీ, మళ్లీ దానికే కాంట్రాక్ట్ ఇచ్చారు. 18.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఆ సంస్థ చేతిలో పెట్టారు’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

  • కోఎంప్ట్‌‌తో మోదీ ప్రభుత్వానికి సంబంధం ఏంటీ? 

కేంద్రప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిలదీశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించారు. ‘‘సీబీఎస్‌‌ఈ కాంట్రాక్టును కోఎంప్ట్ సంస్థకు ఎవరి ఆదేశాల మేరకు కేటాయించారు? ఈ కాంట్రాక్ట్ ఇచ్చే ప్రక్రియలో ఏయే నియమనిబంధనలను పక్కనబెట్టారు? గతంలో గ్లోబరీనా పేరుతో వివాదాల్లో చిక్కుకున్న ఈ సంస్థపై సీబీఎస్‌‌ఈ ఎందుకు బ్యాక్‌‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయలేదు? కోఎంప్ట్ యాజమాన్యానికి, మోదీ ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏమిటి?” అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సిట్‌‌ను ఏర్పాటు చేసిన దీని వెనుక ఉన్న అసలు నిందితును బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

  • సీబీఎస్ఈ ఖండన.. రాహుల్ గాంధీ సెటైర్​

సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై సీబీఎస్ఈ బోర్డ్ స్పందించింది. రాహుల్ ఆరోపణల్లో నిజంలేదంటూ ఖండించింది. ఈమేరకు సీబీఎస్ఈ ఓ ట్వీట్ చేయగా.. రాహుల్ గాంధీ వెంటనే స్పందించారు. సీబీఎస్ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. ‘ఆరోపణలను తోసిపుచ్చడం, లేదా ఖండించడం అనేది ఎన్నటికీ జవాబు కాబోదు. దేశవ్యాప్తంగా దాదాపు 18.5 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి నేను అడిగిన నాలుగు సింపుల్  ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ కానీ, సీబీఎస్ఈ కానీ ఎందుకు జవాబివ్వలేకపోతోంది?.. లక్షలాది మంది విద్యార్థులను త్రిశంకు స్వర్గంలో ఎందుకు ఉంచుతోంది?.. నిజం  తెలుసుకునే హక్కు వారికుంది’ అంటూ రాహుల్ గాంధీ మరోసారి ట్వీట్ చేశారు.