ద్వేషంలేని హిందుస్థానే మా లక్ష్యం : రాహుల్ గాంధీ

ద్వేషంలేని హిందుస్థానే మా లక్ష్యం : రాహుల్  గాంధీ
  •  బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నయ్

రాయ్ గఢ్: బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ మాజీ చీఫ్  రాహుల్ గాంధీ మండిపడ్డారు. రెండ్రోజుల విరామం తర్వాత ఆదివారం చత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ లో ఆయన భారత్ జోడో న్యాయ్ యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మన దేశంలో ఏ మూలన చూసినా విద్వేషం, హింస చెలరేగుతున్నది.

ఆ భాష మాట్లాడేవాళ్లు మాకు నచ్చరని కొందరు.. ఆ రాష్ట్రానికి చెందినవాళ్లు మాకు నచ్చరని ఇంకొందరు.. ఇలా ఇతరులను ద్వేషించేవాళ్లు పెరిగిపోతున్నారు. ఇలాంటి ఆలోచనలు దేశాన్ని బలహీనపరుస్తాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. అయితే మన దేశ డీఎన్ఏలోనే ప్రేమ ఉన్నది. ఇక్కడ వివిధ వర్గాల ప్రజలు ప్రేమతో ప్రశాంతంగా జీవిస్తున్నారు” అని అన్నారు. విద్వేషం, హింస అనేదే లేని హిందుస్థాన్ ను భవిష్యత్తు తరాలకు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. 

మణిపూర్​లో సివిల్ వార్..  

మణిపూర్​లో వందలాది మంది చనిపోయినా, ప్రధాని ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదని రాహుల్ మండిపడ్డారు. రాష్ట్రంలో సివిల్ వార్ నడుస్తున్నదని, దాన్ని కేంద్రం కంట్రోల్ చేయలేకపోతున్నదని ఫైర్ అయ్యారు. ‘అగ్నివీర్’ పేరుతో యువత భవిష్యత్తును కేంద్రం నాశనం చేస్తున్నదని, తాము అధికారంలోకి రాగానే 1.50 లక్షల మంది యూత్​కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

‘డిఫెన్స్ కాంట్రాక్టులు మొత్తం అదానీకే ఇస్తున్నారు. ఇదేంటని పార్లమెంట్​లో ప్రశ్నిస్తే నాపై అనర్హత వేటు వేశారు. ఇల్లు ఖాళీ చేయించారు. ప్రజల గుండెల్లో బతుకుతున్న నాకు.. వాళ్ల ఇల్లు అక్కర్లేదు’ అని అన్నారు. కాగా, చైనా ఫోన్లపై రాహుల్ స్పందిస్తూ.. ‘ఈ ఫోన్ చూడండి. దీన్ని చైనా తయారుచేస్తే, మన దేశంలో అంబానీ అమ్ముతున్నారు. ఇలాంటి ఫోన్లతో చైనీయులు, అంబానీ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ ఫోన్ చత్తీస్ గఢ్​లో తయారు చేయడమే మాక్కావాల్సింది” అని చెప్పారు.