బీజేపీ-ఈసీ చోర్ బజార్లో చోరీని బట్టి రివార్డులు.. బెంగాల్ సీఎస్గా ఎలక్షన్ ఆఫీసర్ నియామకంపై రాహుల్ గాంధీ ఎద్దేవా

బీజేపీ-ఈసీ చోర్ బజార్లో చోరీని బట్టి రివార్డులు.. బెంగాల్ సీఎస్గా ఎలక్షన్ ఆఫీసర్ నియామకంపై రాహుల్ గాంధీ ఎద్దేవా

న్యూఢిల్లీ:  బెంగాల్ ప్రభుత్వంలో జరిగిన బ్యూరోక్రాటిక్ నియామకాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా మాజీ ఎన్నికల అధికారి(చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్) మనోజ్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ను, సీఎం సువేందు అధికారికి ప్రధాన సలహాదారుగా సుబ్రత గుప్తాలను నియమించడాన్ని ఆయన తప్పుబట్టారు. 

బీజేపీ, ఎన్నికల సంఘం కలిపి ఒక 'చోర్ బజార్'ను నడుపుతున్నాయని, అక్కడ ఎంత పెద్ద దొంగతనం చేస్తే అంత పెద్ద రివార్డు లభిస్తుందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా బీజేపీకి కొమ్ముకాసిందని చెప్పడానికి ఈ నియామకాలే నిదర్శనమని మంగళవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. 

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నియామకాలు ఎన్నికల సంఘం, బీజేపీ మధ్య ఉన్న అక్రమ ఒప్పందాలను బహిర్గతం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైంలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో సుమారు 91 లక్షల మందిని  తొలగించడంలో మనోజ్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌, సుబ్రత గుప్తా పాత్ర ఉందని వెల్లడించారు. ఆ కృతజ్ఞతతోనే వారికి ఇప్పుడు కీలక పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ఇద్దరు అఫీసర్లు వ్యూహాత్మకంగా 27 లక్షల మందిని ఓటింగ్ కు దూరం చేసి బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చారని ఫైర్ అయ్యారు.