జమూయ్/గయాజీ: ఎలక్షన్ కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బుధవారం బిహార్‌లోని జమూయ్, గయాజీ, బాంకా సిటీల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో రాజ్‌నాథ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా హర్యానాలో ఓట్ల చోరీపై రాహుల్ చేసిన ఆరోపణలపై స్పందించారు.
ఎలాంటి ఆధారాలు లేకున్నా రాజ్యాంగ సంస్థలపై రాహుల్ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే మన దేశ ఆర్మీ 10 శాతం మంది అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నదని రాహుల్ చేసిన కామెంట్లపై స్పందిస్తూ.. ‘‘రాహుల్ గాంధీకి ఏమైంది? సైనిక దళాల్లో రిజర్వేషన్ల ఇష్యూను ఆయన లేవనెత్తుతున్నారు.
ఆర్మీలో రిజర్వేషన్లను డిమాండ్ చేయడం ద్వారా దేశంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. ఆర్మీ వీటన్నింటికీ అతీతమని పేర్కొన్నారు. దేశాన్ని పాలించడమంటే.. చిన్న పిల్లల ఆట కాదన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌తో ఆర్మీ మన దేశ సత్తాను చూపెట్టింది. ఆపరేషన్ సిందూర్‌కు బ్రేక్ ఇచ్చాం అంతే.. పూర్తిగా ఆపేయలేదు. ఒకవేళ ఉగ్రవాదులు మళ్లీ మన దేశంపై దాడికి ప్రయత్నిస్తే, స్ట్రాంగ్ రిప్లై ఇస్తాం. భారత్ ఎవరినీ రెచ్చగొట్టదు.. కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం భారత్ సహించేది లేదు” అని స్పష్టం చేశారు.
నితీశ్ నీతిమంతుడు..
బిహార్ సీఎం నితీశ్ కుమార్ నీతిమంతుడని, ఆయనపై ఒక్క అవినీతి కేసు కూడా లేదని రాజ్‌నాథ్ అన్నారు. ఆర్జేడీ నేతలందరూ అవినీతిలో కూరుకుపోయారని మండిపడ్డారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే, ఆర్జేడీ నేతలు తుపాకుల గురించి మాట్లాడుతుంటారని విమర్శించారు. ప్రజల మద్దతు ఎన్డీయేకే ఉన్నదని, బిహార్‌లో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
