- ఖర్గేతో కలిసి పీసీసీ సమావేశంలో పాల్గొంటారు: మహేశ్ కుమార్‌గౌడ్
- కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు
- దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలి
- జనాభా ప్రకారం ప్రయోజనాలు కల్పించాలి
- 6 లేదా 7 న పీసీసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
- కాంగ్రెస్‌లో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ పార్టీలోనూ లేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఈ నెల 5 న హైదరాబాద్‌కు రానున్నట్టు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. వారిద్దరూ అదేరోజు నిర్వహించే పీసీసీ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. శనివారం గాంధీ భవన్లో మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని బోయినపల్లిలో ఉన్న మహాత్మా గాంధీ ఐడియాలజీ సెంటర్లో మేధావులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన పెద్దలతో రాహుల్, ఖర్గే సమావేశం అవుతారని చెప్పారు.
రాష్ట్రంలో కుల గణనను ఎలా అమలు చేయాలనే దానిపై వివిధ వర్గాలు, రంగాలకు చెందిన పెద్దలు ఇచ్చే సలహాలు, సూచనలను రాహుల్ స్వీకరిస్తారని తెలిపారు. తాను, సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు రాహుల్, ఖర్గే హైదరాబాద్ కు వస్తున్నారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. కులగణన విషయంలో రాహుల్‌గాంధీ కి ఉన్న చిత్తశుద్ధికి ఈ పర్యటనే నిదర్శనమని చెప్పారు. దేశవ్యాప్తంగా కుల గణన జరగాలని, జనాభా ఏ నిష్పత్తిలో ఉంటే అదేస్థాయిలో సంపద పంపిణీ జరగాలనేది రాహుల్ ఉద్దేశమని తెలిపారు. కుల గణన సర్వేలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శనివారం డీసీసీ మీటింగ్ లు ఏర్పాటు చేసి, కుల గణనపై అవగాహన కల్పించామని చెప్పారు.
కులగణనపై ఆల్‌పార్టీ మీటింగ్
పీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 6 న లేదా 7 న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, కుల గణనపై అన్ని పార్టీల సలహాలు తీసుకుంటామని మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలను, వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లను సొంత నియోజకవర్గాలకు కాకుండా ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ పనితీరు, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం వంటి వాటిని ఈ ఇన్చార్జిలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పీసీసీకి నివేదిస్తారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారు ఆశించిన రీతిలో తమ ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. ప్రజలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగుతున్నదని తెలిపారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఉండగా, మళ్లీ కొత్త సీఎం ప్రస్తావన ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. మహేశ్వర్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయనకు బీజేపీలో తగిన గౌరవం దక్కడం లేదని అన్నారు. ఆ పార్టీలోనే ఆయనకు కుర్చీ లేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో ఆయనకు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య వార్ నడుస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ లో ఉన్న ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఇతర ఏ పార్టీలో ఉండదని తెలిపారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారని, సంక్షేమ పథకాల అమలు ఎక్కడ అని ప్రశ్నించారు. సంక్షేమానికి కాంగ్రెస్ పేటెంట్ అని స్పష్టం చేశారు.
కులగణనపై కనెక్టింగ్ సెంటర్ ప్రారంభం
కుల గణన సక్సెస్ కోసం పీసీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రోగ్రామ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్టీపరంగా తనవంతు సహకారాన్ని అందిస్తున్నది. ఇందులో భాగంగానే శనివారం ఇందిరా భవన్ లో కుల గణనపై కనెక్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. దీన్ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కుల గణనతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.