
న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నేత బాధ్యతలు నిర్వర్తించేందుకు రాహుల్ గాంధీనే సరైన వ్యక్తి అంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. లీడర్ ఆఫ్ ది అపొజిషన్‌గా రాహుల్‌ను ఎన్నుకోవాలంటూ తీర్మానం పాస్ చేసింది. శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ జరిగింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా సీనియర్ నేతలు హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాల వెనక సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల కృషిని గుర్తించినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పారు. వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ ఎంపీలంతా రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని డిమాండ్ చేశారని వివరించారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్రలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని చెప్పారు. అటు ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరగడంతో పాటు రాహుల్ మరింత రాటుదేలారని వేణుగోపాల్ చెప్పారు.
ఈ రెండు యాత్రలతో పాటు రాహుల్ ఆలోచనలు దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పునకు కారణమయ్యాయని తెలిపారు. లక్షలాది కార్యకర్తలతో పాటు కోట్లాది మంది ఓటర్లలో రాహుల్ తన యాత్రల ద్వారా ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. ఈ అనుభవాలతోనే పార్టీ మేనిఫెస్టోను రూపొందించామని చెబుతూ.. ‘పాంచ్ న్యాయ్ పచ్చీస్ గ్యారంటీ’ పేరుతో ఇచ్చిన హామీలు ప్రజల్లోకి నేరుగా వెళ్లాయని వివరించారు. ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల్లో పార్టీ గెలుపొందడంలో కీలకంగా మారిన పార్టీ మేనిఫెస్టో మొత్తం రాహుల్ గాంధీ ఆలోచనల్లో నుంచి పుట్టిందేనని తెలిపారు. యాత్రలో తనకు ఎదురైన అనుభవాలను, ప్రజల అవసరాలను గుర్తిస్తూ వాటికి పరిష్కారాలు వెతికే ప్రయత్నాన్ని మేనిఫెస్టో నుంచే మొదలుపెట్టినట్లు వేణుగోపాల్ చెప్పారు. ఇది ప్రజలను ఆకర్షించి కాంగ్రెస్‌కు ఓటేసేలా ప్రోత్సహించిందన్నారు. కాగా, సీడబ్ల్యూసీ తీర్మానంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని
రాహుల్ గాంధీ జవాబిచ్చినట్లు సమాచారం.
కూటమి సమన్వయంతో పనిచేయాలి : ఖర్గే
పార్లమెంట్ బయట, లోపల ఇండియా కూటమి సమన్వయంతో పనిచేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పదేండ్ల విభజన, ద్వేషం, ఒంటెద్దు పోకడ రాజకీయాలను తిరస్కరించారని అన్నారు. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమైంది. ఎన్నికల ఫలితాలతోపాటు భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. మల్లికార్జున్ ఖర్గేతోపాటు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సహా పలువురు ఇతర పార్టీ నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా లేకపోయినా.. నిరంతరం పనిచేయాలని, 24 గంటలు..365 రోజులు ప్రజల మధ్యే ఉండాలని సూచించారు. సోనియా, రాహుల్, ప్రియాంకసహా పార్టీ నేతలందరికీ ఖర్గే అభినందనలు తెలిపారు.