జమ్మూకాశ్మీర్​కు రాష్ట్రహోదా ఇవ్వకపోతే.. రోడ్లపై ఆందోళన: రాహుల్ గాంధీ

జమ్మూకాశ్మీర్​కు రాష్ట్రహోదా ఇవ్వకపోతే.. రోడ్లపై ఆందోళన: రాహుల్ గాంధీ
  • కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ హెచ్చరిక 
  • ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా పునరుద్ధరించాల్సిందే
  • ఆ హోదా లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదని ఆందోళన
  • అగ్రి చట్టాలపై కంగన వ్యాఖ్యలపై మోదీ స్పందించాలని డిమాండ్ 

జమ్మూ: అసెంబ్లీ ఎన్నికల తర్వాత జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే ఇండియా కూటమి నేతలమంతా రోడ్లపైకి వస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్ ను రెండు యూటీలుగా విభజించడంతో స్థానిక ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఇక్కడి యువత హక్కు అని, అదే వారి భవిష్యత్తు అని స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జమ్మూలోని జేకే రిసార్ట్ గ్రౌండ్ లో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ‘‘ఒక రాష్ట్రానికి రాష్ట్ర హోదాను తొలగించి, యూటీగా మార్చడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఎన్నికల తర్వాత జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలి. లేకపోతే పార్లమెంట్ లో, వీధుల్లో తీవ్ర నిరసనలు తెలుపుతాం” అని ఆయన ప్రకటించారు. రాష్ట్ర హోదా లేకుంటే జమ్మూకాశ్మీర్ ముందుకు వెళ్లలేదన్నారు.

జమ్మూకాశ్మీర్ లో ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో సాగుతున్న పాలనలో స్థానికుల కంటే బయటి వ్యక్తులకే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతున్నాయని రాహుల్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిని గెలిపిస్తే.. కాశ్మీరీ పండిట్లకు, పీఓకే నుంచి వచ్చిన శరణార్థులకు మన్మోహన్ సింగ్ సర్కారు హయాంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు తొలగిస్తామని, పంజాబీ భాషకు అధికారిక భాషా హోదాను కల్పిస్తామన్నారు.

కంగన వ్యాఖ్యలపై మోదీ స్పందించాలె..

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు అగ్రి చట్టాలను తిరిగి తీసుకురావాలంటూ బీజేపీ ఎంపీ, నటి  కంగనా రనౌత్ చేసిన కామెంట్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘‘కంగన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారా? లేదంటే అగ్రి చట్టాలను మళ్లీ తీసుకురావాలని భావిస్తున్నారా?” అన్నది క్లారిటీ ఇవ్వాలన్నారు. ఒకవేళ అగ్రి చట్టాలను మళ్లీ తేవాలని అనుకుంటే మాత్రం ఇండియా కూటమి నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన ఒక వీడియో స్టేట్ మెంట్ లో  హెచ్చరించారు. ‘‘ప్రభుత్వ పాలసీలను ఎవరు డిసైడ్ చేస్తున్నారు? బీజేపీ ఎంపీనా? ప్రధాని మోదీనా? నిజానికి బీజేపీ నేతలు తమ ఐడియాలను టెస్ట్ చేస్తున్నారు.

 అందులో భాగంగా వాళ్ల నేతల్లో కొందరు కామెంట్లు చేస్తారు. ఆ కామెంట్లపై వచ్చే రియాక్షన్లను పరిశీలిస్తారు. మోదీజీ.. కంగన వ్యాఖ్యలను మీరు వ్యతిరేకిస్తున్నారా? లేదా? చెప్పండి” అని రాహుల్ కోరారు. అగ్రి చట్టాలపై ఉద్యమంలో 700 మంది రైతులు చనిపోయినా.. ప్రధాని మోదీ రెండు నిమిషాల మౌనం కూడా పాటించలేదన్నారు. ఒకవేళ ఆ చట్టాలను మళ్లీ తెస్తే.. మోదీ మళ్లీ క్షమాపణలు  చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.