రాహుల్ గాంధీ సీటుపై రచ్చ

రాహుల్ గాంధీ సీటుపై రచ్చ
  • ఐదో వరుసలో కూర్చోబెట్టి అవమానించారని కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ: ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కేంద్రం అవమానించిందని అపోజిషన్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఆయనకు స్పెషల్ గెస్టు గ్యాలరీలో ఐదో వరుసలో సీటు కేటాయించడంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ సంకుచిత స్వభావానికి ఇది నిదర్శనమని ఫైర్ అయ్యారు. వేడుకల్లో ఒలింపిక్ క్రీడాకారులతో కలిసి రాహుల్ కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో  వేడుకలకు హాజరయ్యారు. తెల్లటి కుర్తా, పైజామా ధరించిన ఆయన.. ఇండియన్ హాకీ జట్టు ఫార్వర్డ్ గుర్జంత్ సింగ్ పక్కన  కూర్చున్నారు. ముందు వరుసలో ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, సరబ్ జోత్ సింగ్ ఉన్నారు.

ఒలింపిక్ కాంస్య విజేత హాకీ జట్టు సభ్యులు, ఆ జట్టు కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ సింగ్, పీఆర్ శ్రీజేశ్ కూడా రాహుల్ కంటే ముందు కూర్చున్నారు. ప్రొటోకాల్ ప్రకారం.. లోక్‌‌సభ ప్రతిపక్ష నేతకు, కేబినెట్ మంత్రికి ముందు వరుసలో సీటు కేటాయించాలి. సీజేఐ డీవై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, అమిత్ షా, ఎస్ జైశంకర్ అలాగే ముందు వరుసలో కూర్చున్నారు. కానీ.. రాహుల్, మల్లికార్జున ఖర్గేకు ఐదో వరుసలో సీటు అలాట్ చేసినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే, రాహుల్ సీటింగ్ విషయంపై చర్చ జరగడంతో దీనిపై కేంద్రం స్పందించింది. ఒలింపిక్‌‌ పతక విజేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడం వల్ల కాంగ్రెస్‌‌ ఎంపీలకు వెనక వరుసలో సీట్లు కేటాయించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. 

పదేండ్లలో తొలిసారి.. ఎర్రకోట వద్ద వేడుకలకు ప్రతిపక్ష నేత
ఎర్రకోట వద్ద గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం గత పదేండ్లలో ఇదే తొలిసారి.