లక్ష కోట్ల అవినీతి అనడం పెద్ద జోక్.. దేశాన్ని దోచుకున్నది కాంగ్రెస్సే: హరీశ్

లక్ష కోట్ల అవినీతి అనడం పెద్ద జోక్.. దేశాన్ని దోచుకున్నది కాంగ్రెస్సే: హరీశ్

హైదరాబాద్, వెలుగు: దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్​ పార్టీదేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఖమ్మం సభలో రాహుల్​గాంధీ చేసిన కామెంట్లకు ట్విట్టర్ వేదికగా ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘‘అవినీతికి మారుపేరు కాంగ్రెస్. అందుకే ఆ పార్టీ పేరు స్కాంగ్రెస్ గా మారింది. దేశ ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదు. మాది పేదల ఏ టీమ్. ప్రజల సంక్షేమం చూస్తే ఏ క్లాస్​టీమ్”అని హరీశ్ అన్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్​కు లేదని, అందుకే దేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడేందుకు బీఆర్ఎస్ పుట్టిందని తెలిపారు. ‘‘రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ కనిపించడం లేదా? మేము పట్టాలు ఇచ్చాక మళ్లీ మీరు ఇచ్చేది ఏంటి?”అని హరీశ్ ప్రశ్నించారు. అప్​డేట్ తెలుసుకొని మాట్లాడాలని, రాహుల్ గాంధీ ఔట్ డేటెడ్ పొలిటిషన్ అని ఎద్దేవా చేశారు. 

లక్ష కోట్ల అవినీతి అనడం పెద్ద జోక్

‘‘కాళేశ్వరం కోసం ఖర్చు చేసింది రూ.80,321.57 కోట్లని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమే సమాధానం చెప్పింది. అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి అనడం పెద్దజోక్. స్కామ్​లలో ఆరితేరిన కాంగ్రెస్.. కుంభకోణాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే..”అని హరీశ్ ఎద్దేవా చేశారు. ముదిగొండ కాల్పులను అప్పుడే మరిచిపోయారా? అని ప్రశ్నించారు. భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్లు, కరెంట్ అడిగితే పిట్టల్లా కాల్చిచంపినోళ్లు ఖమ్మంలో కల్లబొల్లి కబుర్లు చెప్తే నమ్మేవాళ్లు ఎవరూ లేరని ఫైర్ అయ్యారు. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలతో రాసిచ్చిన స్క్రిప్ట్​తో రాహుల్ గాంధీ ఖమ్మం సభలో స్కిట్ చేశారన్నారు.